క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్‌

10 Jun, 2021 06:23 IST|Sakshi

బార్బరా జబారికా వెల్లడి

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం నిందితుడు, డొమినికాలో కోర్టు విచారణని ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. డొమినికా మీదుగా క్యూబాకు పారిపోవాలని చోక్సి పన్నాగం పన్నాడని ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్బరా జబారికా చెప్పారు. వచ్చేసారి క్యూబాలో కలుసుకుంటామని చోక్సి తనతో చెప్పినట్టుగా ఆమె ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ అతను క్యూబాలో స్థిరపడాలని భావించాడు’అని బార్బరా చెప్పారు. చోక్సికి తాను గర్ల్‌ఫ్రెండ్‌ని కాదన్నారు.  

చోక్సి నేరస్తుడని తెలీదు  
చోక్సి పరారీలో ఉన్న నేరస్తుడని తనకు అసలు తెలీదని, అతని అసలు పేరు, బ్యాక్‌ గ్రౌండ్‌ ఏదీ తనకు తెలీదని బార్బరా చెప్పారు. ‘నేను యూరోపియన్‌ని. భారత ఆర్థిక నేరగాళ్ల జాబితా గురించీ తెలీదు. చోక్సి అసలు పేరేమిటో గత వారం వరకు నాకు తెలీదు. గత ఏడాది ఆగస్టులో మొదటిసారి చోక్సిని కలుసుకున్నాను. తన పేరు రాజ్‌ అని పరిచయం చేసుకున్నాడు. తరచు నాకు మెసేజ్‌లు పెడుతూ ఉండేవాడు. కానీ నెలకోసారి మాత్రం రిప్లయ్‌ ఇచ్చేదాన్ని’ అని చెప్పారు.  మరోవైపు ఆంటిగ్వాలో కిడ్నాప్‌ చేసి తనను డొమినికాకు తీసుకువచ్చారని, ఆ కిడ్నాప్‌లో బార్బరా హస్తం కూడా ఉందంటూ చోక్సి చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. మెహుల్‌ చోక్సి బెయిల్‌ పిటిషన్‌ విచారణని డొమినికా హైకోర్టు 11వ తేదీకి వాయిదా వేసినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. కింద కోర్టు అతని బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించడంతో చోక్సి హైకోర్టుకెక్కారు.

మరిన్ని వార్తలు