సీన్యో కాల్వీనో

9 Oct, 2023 00:03 IST|Sakshi

ఇటాలో కాల్వీనో అనే పేరు వినగానే ఆయనో ఇటాలియన్  రచయిత అనిపించడం సహజమే. ఊహకు అందేట్టుగా ఇటాలియనే అయినా కాల్వీనో పుట్టింది క్యూబా రాజధాని హవానాలో. తమ దేశ మూలాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో తల్లి పెట్టిన ఈ పేరు ఆయనకు పెద్దయ్యాక మరీ జాతీయవాదపు పేరులా తోచింది. అయితే వాళ్ల కుటుంబం ఇటలీకి తిరిగి వచ్చాక, తన 20 ఏళ్ల వయసులో కాల్వీనో జాతీయవాద ఫాసిస్టు పార్టీ మీద పోరాడటం దానికి ఒక చిత్రమైన కొనసాగింపు.

ఆ పోరాటంలో భాగంగా ఇటాలియన్  కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యాడు. కమ్యూనిస్టుగా బతికాడు. అనంతర కాలంలో ఆ పార్టీకి దూరమయ్యాడు. అప్పటికే ఆయన వాస్తవిక చిత్రణ మీద పార్టీ విమర్శించడం మొదలుపెట్టింది. ఇక హంగెరీ మీద సోవియట్‌ రష్యా దాడి(1956) తర్వాత పార్టీ మీది భ్రమలు పూర్తిగా చెదిరిపోయి రాజీనామా చేశాడు. మళ్లీ ఏ పార్టీలోనూ సభ్యుడు కాలేదు.

జర్నలిస్టుగా ఉద్యోగం చేసుకుంటూ; కథలు, నవలలు రాసుకుంటూ; తనకు నచ్చిన రాతలను ప్రమోట్‌ చేసుకుంటూ, కథల మీద మాట్లాడుకుంటూ బతికాడు. ఆధునిక ఇటాలియన్  సాహిత్యంలో అత్యధికంగా అనువాదం అయిన రచయితగా ప్రసిద్ధి గడించిన ఇటాలో కాల్వీనో శతజయంతి (జననం: 1923 అక్టోబర్‌ 15) సంవత్సరం ఇది.

ఇటాలో కాల్వీనో ప్రపంచంలో నిచ్చెన వేసుకుని చందమామ మీదికి ఒక్క గెంతులో ఎక్కేయొచ్చు. దాని పాలను లోడుకోవచ్చు. చేయాల్సిందల్లా పొక్కులుగట్టిన చందమామ ఉపరితలం మీదుండే పొలుసులను కొద్దిగా జరిపి అక్కడ గరిట పెట్టడమే. కాకపోతే ఆ మీగడ చిక్కదనపు పాలల్లో ‘ఎక్కువభాగం పండ్లు, కప్పల గుడ్లు, శిలాజిత్, అలచందలు, తేనె, పటికలుగా మారిన పిండి, సొరచేపల గుడ్లు, నాచు, పుప్పొడి, చిన్నచిన్న పురుగులు, చెట్ల జిగురు, మిరియాలు, ఖనిజ లవణాలు, బూడిద’ ఉంటాయి కాబట్టి వాటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది (ద డిస్టన్ ్స ఆఫ్‌ ద మూన్ ). ఇంకా, కాల్వీనో లోకంలో చిన్న పిల్లను పోనివ్వడానికి జోర్డాన్  నది తన నీటిని కొద్దిగా వంచి దారి ఇస్తుంది.

ఎందుకంటే ఆ నదికి ఇష్టమైన ఉంగరపు ఆకృతి కేకుల్ని ఆ పాప పెడతానంది కదా (ఫాల్స్‌ గ్రాండ్‌మదర్‌)! ఆయన సృజించిన నగరానికి ఎప్పటికీ దేనికీ కిందికి దిగే పనిలేదు. అది పొడవాటి ఫ్లెమింగో కాళ్ల మీద నిలబడి ఉంటుంది. అదొక్కటే నగరానికీ, భూమికీ సంబంధం (ది ఇన్విజిబుల్‌ సిటీ). వెంట వెంటనే కలుసుకుంటున్నట్టుగా వచ్చి, లేచి, విరిగిపడే అలల్లో ఒకదాన్నుంచి ఇంకోదాన్ని ఎలా విడదీయాలో తెలీక అదేపనిగా చూస్తుంటాడు ‘మిస్టర్‌ పాలొమార్‌’. విలువలు తలకిందులైన ప్రపంచంలో ఒక మనిషి నిజాయితీ కూడా ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేయగలదు. అందరూ బుద్ధిగా దొంగతనం చేస్తున్నప్పుడు, ఆయన మాత్రం చేయనంటే ఎలా కుదురుతుంది? (ద బ్లాక్‌ షీప్‌).

కాల్వీనో తల్లి ఇటలీలోని సార్డినీయా ద్వీపానికి చెందినవారు. ప్రపంచంలో శతాధిక వృద్ధులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి. దీనికి భిన్నంగా కాల్వీనో అరవై ఏళ్లే బతికాడు(మరణం: 1985 సెప్టెంబర్‌ 19). ఆయన రచనల విషయంలో మాత్రం ఈ మాట అనలేము. ‘అవర్‌ యాన్సెస్టర్స్‌’ ట్రయాలజీ, ‘కాస్మికామిక్స్‌’ లాంటి పుస్తకాలను వెలువరించిన కాల్వీనో ప్రపంచంలో అన్నీ అసాధ్యాలే.

కొన్నిసార్లు రాస్తున్నప్పుడు నాకు వెర్రెత్తుతుంది అంటాడాయన. ఒక నవలను మళ్లీ మళ్లీ చదవడానికి ఉపక్రమించే పాఠకుడి జీవితం కూడా ఆయనకు నవల అవుతుంది. దీన్ని అత్యంత పోస్ట్‌ మాడర్నిస్ట్‌ నవల అంటారు (ఇఫ్‌ ఆన్  ఎ వింటర్స్‌ నైట్‌ ఎ ట్రావెలర్‌). కానీ ఆయన రచనలు ఎంత ఆధునికమో అంత ప్రాచీనం. ఎంత ప్రాచీనమో అంత ఆధునికం. కొత్త పుంతలు తొక్కడం అనే మాట ఆయనకు బాగా వర్తిస్తుంది. ఇటాలియన్  జానపద గాథలను కూడా ఆయన ప్రచురించాడు. కాల్వీనో రచనా వ్యాసంగంలో ఇదొక ముఖ్యాంశం.

‘రాజకీయాల తర్వాత, సాహిత్యానికి రెండో స్థానం ఇవ్వడం అనే ఆలోచన పెద్ద తప్పు. ఎందుకంటే, రాజకీయాలు దాదాపుగా ఎన్నడూ తన ఆదర్శాలను సాధించలేవు. మరోపక్కన, సాహిత్యం దాని రంగంలో అది కొంతైనా సాధించగలదు, దీర్ఘకాలంలో కొంత ఆచరణాత్మక ప్రభావాన్ని కూడా కలిగించగలదు... ముఖ్యమైన విషయాలు నెమ్మదైన ప్రక్రియల ద్వారా మాత్రమే సాధించగలం’ అనే కాల్వీనో విదేశీ సంస్కృతులను గురించిన అవగాహన ఏ సంస్కృతికైనా కీలకం అనేవాడు. సొంత సృజన శక్తిని సజీవంగా ఉంచుకోవాలంటే విదేశీ ప్రభావాలకు సిద్ధంగా ఉండాలన్నాడు. ఇద్దరం కలుస్తున్నామంటే, భిన్న ప్రపంచాల్ని వెంట బెట్టుకుని వస్తాం; ఆ కలిసిన బిందువు నుంచి కొత్త కథ మొదలవుతుందంటాడు.

ఒకరోజు– మనకు కవితలు, నవలలు రాసేలా కవికీ, రచయితకూ ప్రత్యామ్నాయం కాగలిగే సాంకేతిక పరిజ్ఞానం వస్తుందని 1967లోనే కాల్వీనో ఊహించిన విషయాన్ని ఛాట్‌ జీపీటీ నేపథ్యంలో పాత్రికేయుడు రాబెర్టో డి కారో గుర్తుచేసుకుంటారు. విదేశీ మాటలు, ప్రత్యేకించి ఆంగ్లపదం ‘ఫీడ్‌బ్యాక్‌’ మీద కాల్వీనో మోజు పడి, దాన్ని ఎలాగైనా ‘మిస్టర్‌ పొలొమార్‌’ ఆంగ్లానువాదంలో చేర్చాలని ఉబలాటపడ్డాడట.

‘సీన్యో(మిస్టర్‌ లాంటి ఒక గౌరవ వాచకం) కాల్వీనో! ఒక ఇటాలియన్  చెవికి ఆ పదం ఎంత అందంగా వినబడినా, ఆంగ్ల సాహిత్యంలో అదేమంత ఉచితంగా ఉండ’దని కాల్వీనో రచనలకు స్థిర అనువాదకుడిగా పనిచేసిన విలియమ్‌ వీవర్‌ తిరస్కరించాడట. అయితే, ఎంతటి కృత్రిమ మేధ వచ్చినా, చంద్రుడి పాలు మీగడలా చిక్కగా ఉంటాయని ఊహించిన కాల్వీనో మెదడును ఏ కంప్యూటరూ అందుకోలేదని మనం ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చి ఆయన్ని 
ఆనందపరచొచ్చు!  

మరిన్ని వార్తలు