ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జీ20 వర్చువల్ సమావేశం

22 Nov, 2023 08:34 IST|Sakshi

ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జీ-20 వర్చువల్ సమావేశం జరగనుంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ భేటీకి దూరంగా ఉండనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకానున్నారు. ఢిల్లీ డిక్లరేషన్‌ అమలు, ఇజ్రాయెల్- హమాస్ వివాదం, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, ఆర్థిక పురోగతి  సహా ప్రపంచ నూతన సవాళ్లపై చర్చించనున్నారు. 

సమ్మిట్‌లో సభ్య దేశాల నాయకుల నుంచి అద్భుతమైన భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్నట్లు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడం లేదు. ఆయనకు బదులుగా ప్రీమియర్ లీ కియాంగ్ చైనాకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి సానుకూలంగా దోహదపడేందుకు ఈ సదస్సు సహకారాన్ని పెంపొందిస్తుందని చైనా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

వర్చువల్ సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రకటించింది. సెప్టెంబరులో జరిగిన న్యూ ఢిల్లీ G20 సమ్మిట్‌లో ఆయన గౌర్హజరైన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది జరిగిన జీ20 బాలి సదస్సుకు కూడా పుతిన్ దూరమయ్యారు. ప్రస్తుతం పుతిన్ హాజరువుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చ జరిగే అవకాశం ఉంటుందని సమాచారం. 

ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం

మరిన్ని వార్తలు