Rajasthan Politics : రాజస్థాన్‌కు యూపీ సీఎం.. కారణమిదే!

5 Dec, 2023 12:35 IST|Sakshi

రాజస్థాన్‌లో కొత్త ముఖ్యమంత్రి ఎన్నికకు సంబంధించి జైపూర్ నుండి న్యూఢిల్లీ వరకు చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజస్థాన్‌లో  పర్యటించడం ఆసక్తికరంగా మారింది. అయితే యూపీ సీఎం యోగి పర్యటన రాజకీయం కాదని తెలుస్తోంది. 

ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈరోజు(మంగళవారం) సాయంత్రం చిత్తోర్ గఢ్ రానున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం 4:50 గంటలకు ప్రత్యేక విమానంలో ఉదయపూర్‌లోని దబోక్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో భూపాలసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంకర్వా గ్రామానికి వెళ్తారు. 

సాయంత్రం 5:40 గంటలకు గ్రామంలో జరిగే ఒక వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 6:20 గంటలకు ఉదయ్‌పూర్ దబోక్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. ఆ తర్వాత తిరిగి యూపీకి చేరుకుంటారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇదేవిధంగా నవంబర్ 28న జైపూర్‌ వచ్చారు. తన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న స్వతంత్ర దేవ్ సింగ్ కుమార్తె వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. 

యూపీ సీఎం  యోగి ఆదిత్యనాథ్ తాజా పర్యటన దృష్ట్యా, చిత్తోర్‌గఢ్ కలెక్టర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  ఎంతో యాక్టివ్‌గా వ్యవహరించారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఆయన జైపూర్ సహా పలు జిల్లాల్లో పర్యటించారు. పార్టీకి అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని యోగి విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: రౌడీలను హెచ్చరించిన ‘రాజస్థాన్‌ యోగి’

>
మరిన్ని వార్తలు