Test Captain: రోహిత్‌ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్‌ అతడే! గిల్‌కు కూడా ఛాన్స్‌!

5 Dec, 2023 14:36 IST|Sakshi
రోహిత్‌ శర్మ (PC: BCCI)

Who can be India's Test captain: టెస్టుల్లో టీమిండియా భవిష్యత్‌ కెప్టెన్‌ ఎవరన్న ప్రశ్నకు భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర సమాధానమిచ్చాడు. రోహిత్‌ శర్మ తర్వాత సంప్రదాయ క్రికెట్‌లో భారత జట్టును ముందుండి నడిపించగల సత్తా శుబ్‌మన్‌ గిల్‌కు ఉందని పేర్కొన్నాడు.

అయితే, గిల్‌ కంటే కూడా టెస్టు కెప్టెన్సీ చేపట్టగల అర్హత మరొకరికి ఉందంటూ ట్విస్ట్‌ ఇచ్చాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌.. ముఖ్యంగా టీ20 సారథ్య బాధ్యతల నుంచి 36 ఏళ్ల రోహిత్‌ శర్మ తప్పుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే.

పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్సీకి గుడ్‌బై?
వన్డే వరల్డ్‌కప్‌-2023కి ముందు ఏడాది కాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న హిట్‌మ్యాన్‌.. మెగా టోర్నీ ముగిసిన తర్వాత కూడా టీ20లలో పునరాగమనం చేసే పరిస్థితి కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే, టీ20 సిరీస్‌లకు రోహిత్‌ శర్మ దూరం కాగా.. ఆయా ఫార్మాట్లలో కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టును ముందుకు నడపించనున్నారు.

అయితే, టెస్టు సిరీస్‌ సందర్భంగా బాక్సింగ్‌ డే మ్యాచ్‌లో రోహిత్‌ తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌ ముగిసే నాటికి రోహిత్‌ శర్మ ఈ బాధ్యతల నుంచి వైదొలిగే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

గిల్‌కు కూడా ఛాన్స్‌! అయితే..
ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రాకు.. టీమిండియా టెస్టు భవిష్య కెప్టెన్‌ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను దీర్ఘకాలంలో జరిగే మార్పుల గురించి మాట్లాడుతున్నా.

24 క్యారెట్ల బంగారం లాంటి టెస్టు క్రికెటర్‌
ఇప్పటికిప్పుడు కాకున్నా.. రానున్న కాలంలో టెస్టులకు శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే.. రిషభ్‌ పంత్‌ రూపంలో 24 క్యారెట్ల బంగారం లాంటి టెస్టు క్రికెటర్‌ అందుబాటులో ఉన్నాడన్న విషయాన్ని విస్మరించలేం.

అతడు గేమ్‌ ఛేంజర్‌. కాబట్టి పంత్‌కు కెప్టెన్‌గానూ అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి రోహిత్‌ శర్మ టెస్టు పగ్గాలు వదిలేస్తే.. వీరిద్దరిలో ఎవరో ఒకరు అతడి స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. 

ఏడాది కాలంగా ఆటకు దూరమైన పంత్‌
ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో తొలిసారి సఫారీ గడ్డపై రోహిత్‌ సేన టెస్టు సిరీస్‌ గెలిచే అవకాశం ఉందన్న ఈ మాజీ క్రికెటర్‌.. ప్రొటిస్‌ జట్టు మాత్రం టీమిండియా ముందు అంత తేలికగ్గా తలవంచదని అభిప్రాయపడ్డాడు. కాగా డిసెంబరు 10 నుంచి టీమిండియా సౌతాఫ్రికా టూర్‌ ఆరంభం కానుంది.

ఇదిలా ఉంటే.. గిల్‌ టీమిండియా ఓపెనర్‌గా మూడు ఫార్మాట్లలో తన స్థానం సుస్థిరం చేసుకోగా.. కారు ప్రమాదానికి గురైన పంత్‌ దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌-2024తో అతడు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక గిల్‌ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించలేదు. అయితే, పంత్‌ మాత్రం గతంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో సారథిగా ఉన్నాడు.

చదవండి: పది మంది స్కోర్లను ఒక్కడే కొట్టేశాడు.. విధ్వంసం సృష్టించిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌

>
మరిన్ని వార్తలు