విజన్‌ 200; రజనీపై పరోక్ష విమర్శలు

21 Dec, 2020 07:01 IST|Sakshi
ప్రసంగిస్తున్న స్టాలిన్‌  

సాక్షి, చెన్నై: 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజన్‌ 200 నినాదంతో ముందుకు వెళ్దామని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయాత్తం అవుతూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు, ముఖ్య నేతలతో  ఆదివారం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గెలుపే లక్ష్యంగా  వ్యూహాలకు పదును పెట్టారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకేకు వ్యతిరేకం నినాదంతో రూపొందించిన ప్రచార లఘు చిత్రాలను ఆవిష్కరించారు. చదవండి: నేను ఎంజీఆర్‌ రాజకీయ వారసుడ్ని: కమల్‌

23 నుంచి గ్రామ సభలు 
ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో గ్రామ సభలకు డీఎంకే నిర్ణయించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్‌ ఈ వివరాలను సమావేశంలో ప్రకటించారు. ఈనెల 23 నుంచి జనవరి 10వ తేది వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లో ఈ సభలు సాగనున్నట్టు, ఇందులో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ, జిల్లా ఇన్‌చార్జ్‌లు, కార్యదర్శులు, ముఖ్య నేతలు తప్పని సరిగా పాల్గొనాల్సిందేనని ఆదేశించారు. ఈ సభల్లో అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించాలని సూచించారు.  

ఎన్నికలకు సిద్ధంకండి 
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ప్రసంగిస్తూ.. ముందుగానే ఎన్నికల నగారా మోగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో  కూటమి 200లకు పైగా స్థానాలను కైవశం చేసుకోవడమే లక్ష్యం అన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తాను జనవరి మొదటి వారం నుంచి ప్రచారం మొదలు పెడతానని తెలిపారు. డీఎంకే గెలుపు ఖాయమని.. దీనిని అడ్డుకునేందుకు కొత్త వాళ్లు పుట్టుకొస్తున్నారని అన్నారు. వారి చేత బలవంతంగా పార్టీలు ఏర్పాటు చేయిస్తున్నారని పరోక్షంగా రజనీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఇలాంటి వాళ్లు ఎందరు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు