మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌ యాదవ్‌

11 Dec, 2023 16:51 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌(58) పేరును బీజేపీ అధిష్టానం సోమవారం ప్రకటించింది. భోపాల్‌లో బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన పార్టీ లెజిస్లేటివ్‌ భేటీ అనంతరం ఈ ప్రకటన చేసింది.  తాజా ఎన్నికల్లో దక్షిణ ఉజ్జయిని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు మోహన్‌ యాదవ్‌. 

మోహన్‌ యాదవ్‌.. 25 మార్చి 1965లో ఉజ్జయినిలో జన్మించారు. 2013లో తొలిసారిగా ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2018లో మళ్లీ అదే అసెంబ్లీ స్థానంలో గెలుపొందారు. ఇక.. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా కేంద్ర మాజీ మంత్రి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన నరేంద్ర సింగ్‌ తోమర్‌ను ప్రకటించారు. 

సీఎం రేసులో పలువురి పేర్లను పరిశీలించిన బీజేపీ అధిష్టానం.. చివరకు అనూహ్యంగా ఆరెస్సెస్‌ మద్దతు ఉన్న, బీసీ సామాజిక వర్గానికి చెందిన మోహన్‌ యాదవ్‌ వైపు మొగ్గు చూపింది. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో 163 సీట్లు కైవసం చేసుకుని.. వరుసగా ఐదో సారి అధికారం చేజిక్కించుకుంది కమలం పార్టీ. అయితే పది రోజుల తర్జన భర్జనల తర్వాత చివరకు మోహన్‌ యాదవ్‌ను సీఎంగా ప్రకటించింది. 

>
మరిన్ని వార్తలు