కరోనా, బ్లాక్‌ ఫంగస్: 85 రోజులు మృత్యువుతో పోరాడి

7 Jul, 2021 16:16 IST|Sakshi

వైద్యులను ఆశ్చర్యానికి గురి చేస్తున్న ముంబై పేషెంట్‌

కోవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌తో సహా ఇతర అనారోగ్య సమస్యలు

85 రోజుల పాటు వెంటిలేటర్‌ మీదనే

ముంబై: కరోనా మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎందరినో బలి తీసుకుంది. కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది వేర్వేరు ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి మృతి చెందారు. కానీ, ముంబైకి చెందిన ఒక వ్యక్తి గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా మృత్యుంజయుడే అంటారు. ఎందుకంటే సదరు వ్యక్తి కరోనాతో మాత్రమే కాక, బ్లాక్ ఫంగస్, అవయవాల విఫలం వంటి పలు తీవ్ర సమస్యలతో పోరాడాడు. ఒకానొక సమయంలో వైద్యులు, కుటుంబ సభ్యులు కూడా సదరు వ్యక్తి మీద ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఆశ్చర్యంగా అతడు ఈ సమస్యలన్నింటి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. 

ముంబైకి చెందిన 54 ఏళ్ల భరత్ పంచల్ అనే వ్యక్తి మార్చి మూడో వారంలో కోవిడ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 8న జ్వరం రావడంతో హిరానందాని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ భరత్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. సిటీ స్కాన్‌లో భరత్‌కు కరోనా మోతాదు 21 నుంచి 25 మధ్యలో ఉన్నట్లు తేలింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్ ఎక్కువయి.. ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడింది. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. వైద్యులు వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉంచారు. 

ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే భరత్ శరీరంలోని ఇతర అవయవాలలో కూడా సమస్యలు మొదలయ్యాయి. అతని ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. మూత్రపిండాలు దెబ్బతినడం, కాలేయం పనిచేయకపోవడం, సెప్సిస్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, ఊపిరితిత్తుల చీలిక వంటి చాలా లక్షణాలతో పాటు కోవిడ్ రోగులలో కనిపించే బ్లాక్ ఫంగస్ బారిన కూడా పడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ పరిస్థితుల మధ్య భరత్.. 70 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్నాడు. కోవిడ్ రోగికి వచ్చే ప్రతి సమస్య.. భరత్‌కు వచ్చినట్లు హిరానందాని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గత 15 నెలల్లో తమ ఆస్సత్రిలో ఏ పేషంట్ ఎక్కువ కాలం ఇలా ఉండలేదని వారన్నారు.

భరత్‌ను రక్షించేందుకు వైద్యశాస్త్రంలోని ప్రతి అవకాశాన్ని వైద్యులు ప్రయత్నించారు. రెమిడెసివర్, ప్లాస్మా థెరపితో పాటు మరికొన్ని చికిత్సలను కూడా చేశారు. కానీ, వీటి వల్ల భరత్‌ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు రాలేదు. పైగా.. భరత్ ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం కావడం ప్రారంభం కావడంతో.. అతని కుటుంబం ఆశలు వదులుకుంది. అయితే తనను రక్షించుకోవడం కోసం తన కుటుంబం పడుతున్న ఆరాటం చూసిన భరత్.. ఎలాగైనా బతకాలని దృఢసంకల్పంతో బాధను భరించాడు.

ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం ప్రారంభమైన 15 రోజుల తర్వాత చికిత్సకు స్పందించి.. అన్ని సమస్యలను అధిగమించాడు. దాంతో 85 రోజుల చికిత్స తర్వాత సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. చనిపోతాడనుకున్న భరత్.. తిరిగి ఇంటికి రావడంతో ఆయన కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు