‘ఊపిరి’కి ఎందుకీ కష్టం?

23 Apr, 2021 05:51 IST|Sakshi

డెడ్, బారో ఆర్‌ స్టీల్‌ ఏదో ఒకటి చేసి ఆక్సిజన్‌ అవసరాలను తీర్చండి

కేంద్రానికి ఢిల్లీ కోర్టు జారీ చేసిన అల్టిమేట్‌ ఇది

అటు సుప్రీంకోర్టు కూడా ఆక్సిజన్‌ సరఫరాలో సమగ్ర వ్యూహాన్ని రచించాలని ఆదేశించింది. వాస్తవానికి లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌కి మించి ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉంది. అయినప్పటికీ ఎందుకీ కొరత? ప్రాణాలతో ఎందుకీ చెలగాటం?  

కరోనా రోగులు గుండెల నిండా గాలి పీల్చుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఆస్పత్రులన్నీ ఆక్సిజన్‌ కొరతతో అల్లాడిపోతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో భారత్‌ మిగులు దేశమే. కానీ పరిస్థితులు అసాధారణంగా మారిపోయి కరోనా రోగుల్లో శ్వాసకోశ ఇబ్బందులు పెరిగిపోవడంతో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ఆక్సిజన్‌ లేక అల్లాడిపోతున్నాయి.

ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్తాన్‌ వంటి రాష్ట్రాలు తాము ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్‌ రాష్ట్ర అవసరాల కోసం ఉంచుకొని... ఇతర రాష్ట్రాలకు పంపిణీని నిలిపివేశాయి. ఉక్కు పరిశ్రమలు అధికంగా ఉన్న ఒడిశా మాత్రం ఆపత్కాలంలో ఇతర రాష్ట్రాలకు అండగా నిలుస్తోంది. ఢిల్లీకి ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. అలాగే గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తమ రాష్ట్రం ఆక్సిజన్‌ సరఫరాకు సాధ్యమైనంతగా తోడ్పాటునందిస్తుందని హామీ ఇచ్చారు. సాధారణ రోజులతో పోల్చి చూస్తే, కరోనా ఫస్ట్‌ వేవ్‌లో ఆక్సిజన్‌కి డిమాండ్‌ నాలుగు రెట్లు పెరిగితే, సెకండ్‌ వేవ్‌ వచ్చేసరికి ఏడు రెట్లు పెరిగింది. అయినప్పటికీ డిమాండ్‌కి తగ్గ ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకుంది.  

ఎందుకీ కొరత ?
మన దేశంలో సమృద్ధిగా ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయి. రోజుకి 7,287 టన్నుల ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్‌ సొంతం. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 9,301 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను మనం ఎగుమతి చేయగలిగాం. అయితే పంపిణీలో నెలకొన్న అసమానతల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి సరిపడా ట్యాంకర్లు, సిలిండర్లు మాత్రం లేవు. క్రయోజెనిక్‌ సిలండర్ల కొరతతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి 3–5 రోజుల్లో వెళ్లాల్సిన ఆక్సిజన్‌ 6 నుంచి 8 రోజులు పడుతోంది. ‘‘ఆక్సిజన్‌ కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి కాస్త సమయం కావాలి.

ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఆ రాష్ట్రాలకు కాస్త దూరంగా ఉన్నాయి. ఆక్సిజన్‌ పంపిణీపై ఎలాంటి నియంత్రణలు లేకపోయినా కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా తమ అవసరాల కోసం సరఫరాని నిలిపివేశాయి. దీంతో ఆక్సిజన్‌కి కొరత ఏర్పడింది. ఇది తాత్కాలికమే.’’అని భారత్‌లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సంస్థ ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్ట్స్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ వెల్లడించారు. కరోనా కేసులు రోజుకి అయిదు లక్షలు నమోదైతే మాత్రం సమస్యలు ఎదురవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు మే చివరి నాటికి తగ్గు ముఖం పట్టకపోతే మాత్రం దేశంలో ప్రాణవాయువు దొరక్క మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

పరిష్కారానికి కేంద్రం చర్యలివీ...
► రాష్ట్రాల అవసరాలను గుర్తించి వారికి ఇచ్చే వాటాను ఇప్పటికే పెంచింది. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లోని ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల్లో 60 శాతం మందికి ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరం అవుతోంది. అందుకే ఆ రాష్ట్రాలకు అధికంగా ఆక్సిజన్‌ను సరఫరా చేయనుంది.  
► ఆక్సిజన్‌ రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లను పట్టాలెక్కించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ 100 టన్నుల ఆక్సిజన్‌ను తీసుకుని వైజాగ్‌ నుంచి మహారాష్ట్రకు గురువారం బయల్దేరింది.  
► నైట్రోజన్‌ ట్యాంకుల్ని కూడా ఆక్సిజన్‌ని తరలించడానికి ఇక వినియోగించనుంది.  
► క్రయోజెనిక్‌ ట్యాంకుల్ని దేశీయంగా తయారు చేయాలంటే నాలుగు నెలలు పడుతుంది. అందుకే వాటిని దిగుమతి చేసుకోవడానికి చర్యలు తీసుకుంటోంది.  
► 50వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ దిగుమతికి సన్నాహాలు  
► దేశవ్యాప్తంగా 162 ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. కానీ వీటిలో ఇప్పటికి 4 మాత్రమే పూర్తయ్యాయి.
► అత్యవసరం కాని పరిశ్రమలకు ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేత.  
   

– నేషనల్‌ డెస్క్, సాక్షి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు