అస్సలు ఊహించలేదు.. అగ్నిపథ్‌ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు: నేవీ చీఫ్‌

17 Jun, 2022 21:21 IST|Sakshi

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు, నిరసలను అస్సలు ఊహించలేదని, అగ్నిపథ్‌ పథకాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని నావికా దళం అధిపతి అడ్మిరల్‌ ఆర్‌ హరికుమార్‌ అంటున్నారు. అగ్నిపథ్‌ ప్రణాళికలో తాను ఏడాదిన్నరగా పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు. 

భారత సైన్యంలో అతిపెద్ద మానవ వనరుల నిర్వహణ పరివర్తనగా అగ్నిపథ్‌ పథకాన్ని అభివర్ణించారాయన. ‘‘అగ్నిపథ్‌ ప్లానింగ్‌ టీంలో నేను కూడా ఉన్నా. ఏడాదిన్నరగా పని చేశా. ఇది మంచి మార్పును అందించే పథకం. ఇది సైన్యాన్ని అనేక రూపాల్లో సహేతుకంగా ఉపయోగించుకునే మంచి మార్గం. యువతకు అనేక అవకాశాలు అందిస్తుంది. దేశానికి ఎంతో మేలు చేస్తుంది కూడా అని అడ్మిరల్‌ హరికుమార్‌ చెప్పారు. 

ఇంతకు ముందు ఒక వ్యక్తికి భారత సైన్యంలో పని చేసే అవకాశం దొరికితే.. ఇప్పుడు అగ్నిపథ్‌తో నలుగురికి అవకాశం దొరుకుతుంది. సైన్యంలో కొనసాగడమా? లేదంటే మరేదైనా ఉద్యోగం చూసుకోవడమా? అనేది అగ్నివీరులే నిర్ణయించుకుంటారు అని ఆయన తెలిపారు.  అయితే ఆర్మీలో చేరాలనుకుంటున్న వాళ్లు, అభ్యర్థులు.. అగ్నిపథ్‌ను సరైన సమాచారం లేక తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అందువల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వాళ్లు పునరాలోచన చేయాలని అడ్మిరల్‌ హరికుమార్‌ విజ్ఞప్తి చేశారు.

చదవండి: అగ్నిపథ్‌- అపోహలు.. వాస్తవాలు

మరిన్ని వార్తలు