ఫత్వా: టీవీ చూసిన పాటలు విన్నా శిక్ష తప్పదు

21 Aug, 2020 15:05 IST|Sakshi

కోల్‌కతా: ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీ ఆధిపత్య గ్రామానికి చెందిన అధిపతులు టెలివిజన్ చూడటం, క్యారమ్ ఆడటం, మద్యం లేదా లాటరీ టిక్కెట్లు కొనడం, అమ్మడం, సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా సంగీతం వినడం వంటి ఇతర కార్యకలాపాలపై నిషేధం విధించారు. సామాజిక సంస్కరణల కమిటీ రూపొందించిన ఈ ఫత్వా ఆగస్టు 9న జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్పడం, గుండు చేయించడం, గుంజిళ్లు తీయించడం వంటి శిక్షలతో పాటు రూ .500 నుంచి రూ .7000 వరకు జరిమానాలు విధించనున్నట్లు ఆ ఫత్వాలో పేర్కొన్నారు.

ఈ కమిటీ సూచించిన శిక్షల జాబితా: 
టీవీ చూడటం, సంగీతం వినడానికి మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ ఉపయోగించడం: రూ. 1,000 జరిమానా
క్యారమ్‌ బోర్డు ఆడటం: రూ. 500 జరిమానా
లాటరీ కొనుగోలు: రూ. 2,000 జరిమానా
మద్యం అమ్మకం: రూ. 7,000తో పాటు గుండు చేసి గ్రామంలో ఊరేగిస్తారు. 
లాటరీ టికెట్లను అమ్మడం: రూ. 7,000 జరిమానా
మద్యం సేవించడం:  రూ. 2,000 జరిమానా, 10 గుంజిళ్లు
గంజాయి కొనుగోలు: రూ. 7,000 జరిమానా

అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి తెలియజేసేవారికి నేరం స్వభావాన్ని బట్టి 200 నుంచి 2,000 రూపాయల వరకు రివార్డును కూడా కమిటీ ప్రకటించింది. యువ తరం నైతిక, సాంస్కృతిక పద్దతులను తప్పి చెడు మార్గాలలో వెళ్లకుండా ఆపడానికి  వీటిపై నిషేధం విధించినట్లు కమిటీ పేర్కొంది. 

చదవండి: కారంపొడి కొట్టి మరీ దొరికిపోయాడు

మరిన్ని వార్తలు