54 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న మాజీ మంత్రి

27 Feb, 2023 15:59 IST|Sakshi
వివాహ వేదికపై దివ్యశంకర్‌తో ప్రియాంక అగస్తీ

భువనేశ్వర్‌: అధికార పార్టీ బీజూ జనతాదల్‌ కొరాపుట్‌ జిల్లా పరిశీలకుడు, మాజీమంత్రి   కెప్టెన్‌ దివ్యశంకర్‌ మిశ్రా(54) రెండో వివాహం చేసుకున్నారు. పూరీ సమీపంలోని ఓ రిసార్టులో ఆదివారం ఈ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పరిమిత బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే ప్రవేశానికి అనుమతించారు. 

కాగా దివశంకర్‌తోపాటు అతను వివాహం చేసుకున్న ప్రియాంక అగస్తీకి కూడా ఇది రెండో పెళ్లి. వీరిద్దరూ ఇంతకముందు తమ గత వైవాహిక జీవితాలలో విడాకులు తీసుకున్నారు. గతంలో జయపట్నకు చెందిన మహిళతో వివాహం చేసుకున్న ఆయన.. వివిధ కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరి దాంపత్యంలో జన్మించిన కుమారుడు దుబాయ్‌లో చదువుతున్నట్లు సమాచారం.

టాటాలో సీనియర్‌ ఇంజినీర్‌..
దివ్యశంకర మిశ్రాను వివాహం చేసుకున్న ప్రియాంక అగసీకలహండి జిల్లాలోని గోలముండా మండలం డెకోటా గ్రామానికి చెందిన భవానీ అగస్తీ కుమార్తె. సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ ప్రకారం టాటా పవర్‌లో సీనియర్‌ లీడ్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ప్రియాంకకు కూడా ఇది రెండో వివాహం కాగా, గతంలో మానస్‌ పండా అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకున్నారు.

సంచలనాలకు మారు పేరైన దివ్యశంకర్‌.. ఈ వివాహంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దివ్యశంకర్‌ ప్రస్తుతం కలహండి జిల్లా జునాఘడ్‌ విధానసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తొలుత నవీన్‌ క్యాబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా ఉండేవారు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉపాధ్యాయురాలు మమతా మెహర్‌ హత్య కేసులో దివ్యశంకర్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో క్యాబినెట్‌ విస్తరణలో మంత్రి పదవిని నిలబెట్టుకోలేక పోయారు. అయితే ఇటీవల బీజేడీ అధిష్టానం ఆయనకు కొరాపుట్‌ జిల్లా బాధ్యతలు అప్పగించింది.

మరిన్ని వార్తలు