పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!

24 May, 2023 08:08 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీయే ప్రారంభిస్తే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కొత్త భవనాన్ని ఈ నెల 28న లాంఛనంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

నూతన భవన ప్రారంభోత్సవానికి తాము హాజరు కావడం లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఐ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఈకార్యక్రమాన్ని బహిష్కరించాలని, దీనిపై అతిత్వరలో ఒక ఉమ్మడి ప్రకటన జారీ చేయాలని పలు భావసారూప్యం కలిగిన ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు సమాచారం. బుధవారం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. పార్లమెంట్‌ అనేది కేవలం ఒక భవనం కాదని, దేశ ప్రజాస్వామ్యానికి అది పునాది అని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్‌ చెప్పారు. ఇది ప్రధాని మోదీ సొంత వ్యవహారం కాదని అన్నారు. 2020 డిసెంబర్‌లో కొత్త పార్లమెంట్‌ నిర్మాణ శంకుస్థాపన పనులను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. 

ఇది కూడా చదవండి: కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం: సావర్కర్‌ జయంతి.. రాష్ట్రపతికి నో ఆహ్వానం.. రాజకీయ రగడ

మరిన్ని వార్తలు