డీప్‌ఫేక్‌ల అడ్డుకట్టకు ప్రత్యేక అధికారులు: కేంద్రం

24 Nov, 2023 13:08 IST|Sakshi

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఏడు రోజులు గడువు

న్యూఢిల్లీ: డీప్‌ఫేక్‌ల పరిశీలనలకు ఫిర్యాదులకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్‌మీడియా సంస్థలతో సమావేశం తరువాత   కేంద్రం ఈ నిర్ధారణకు వచ్చింది. రెండు రోజుల కీలక సమావేశాల సందర్భంగా  కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  మంత్రి  శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా  విధి విధానాల రూపకల్పనకు  సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఏడు రోజుల సమయం ఇస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. 

డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్య తీసుకునేలా అధికారిని నియమిస్తామని సోషల్ మీడియా కంపెనీలను కలిసిన తర్వాత రాజీవ్ చంద్రశేఖర్  ఈ అంశాన్ని చెప్పారు. ఏఐ ద్వారా సృష్టిస్తున్న డీప్‌ఫేక్‌ వీడియోలు చాలా ప్రమాదకరమని, నకిలీ సమాచారంతో ప్రజలను ఇవి తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు కఠినంగా వ్యవహించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘‘ఐటి రూల్స్ 2021 ప్రకారం నిర్దేశించిన  వ్యవధిలోపు , లేదా రిపోర్టింగ్ చేసిన 36 గంటలలోపు ఆ కంటెంట్‌ను తొలగించాలి. లేదంటే చర్యలు తప్పవు’’ అని స్పష్టం చేశారు.  డీప్‌ఫేక్‌లను సృష్టించినా, వ్యాప్తి చేసినట్టు రుజువైనా లక్ష రూపాయల దాకా జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదని  ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కాగా  దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన డీప్‌ ఫేక్‌ వీడియోల  వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా స్పందిస్తోంది.  డీప్‌ఫేక్‌ను సృష్టించి వ్యాప్తి చేసే వారితోపాటు, సోషల్‌ మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించిన కేంద్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్‌లో పనిచేస్తున్న కంపెనీల సాయంతో డీప్‌ఫేక్‌ వీడియోల కట్టడికి వివరణాత్మక మార్గదర్శకాలను తీసుకొచ్చేందుకు కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భగా ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా పుట్టుకొస్తున్న డీప్‌ఫేక్‌లను  వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా  కొత్త నిబంధనలు తీసుకువస్తామని, అలాంటి వారిపై  కఠినంగా వ్యవహరిస్తామని అశ్విని వైష్ణవ్  గురువారం ప్రకటించారు.

మరిన్ని వార్తలు