Video: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చే పద్దతి ఇదే

24 Nov, 2023 12:29 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌ కూలిన ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు గత 13 రోజులుగా శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉత్తర్‌కాశీలో సిల్క్‌యారా టన్నెల్‌ కూలిన ఘటనలో బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకా కొన్ని గంటల్లో 41 మందిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వీరికి తక్షణమే వైద్య సహాయం అందించేందుకు ఘటన స్థలంలో అంబులెన్సులు, ప్రత్యేక పడకలు, ఔషధాలు, ఆక్సిజన్‌ కిట్లు అందుబాటులో ఉంచారు.

ప్రస్తుతం  టన్నెల కూలిన స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్‌లో ఉండిపోయిన కార్మికులను రాళ్ల శిథిలాల నుంచి  బయకు తీసుకొచ్చే పద్దతి గురించి అధికారులు వెల్లడించారు. పెద్ద పైపు ద్వారా చక్రాలు కలిగిన స్ట్రేచర్‌ను కార్మికుల వద్దకు చేర్చి.. ఒకరి తర్వాత ఒకరిని బయటకు తీసుకురానున్నట్లు తాజాగా తెలిపారు. ఈ మేరకు  జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఆర్‌ఎఫ్‌) ఓ వీడియో విడుదల చేసింది .వెల్డింగ్‌ చేసిన పైపులో స్ట్రెచర్‌ మీద కార్మికులు వెల్లికిలా పడుకొని ఉంటే దానిని తాడుతో ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులు బయటకు లాగనున్నారు.
చదవండి: నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట

కాగా  నవంబర్‌ 12  టన్నెల్‌లోని కొంతభాగం కూలడంతో 41 మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సాగుతున్న సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. డ్రిల్లింగ్‌ సమయంలో రాళ్లు కులడం వంటి కారణాలతో కార్మికులను రక్షించడం సవాలుగా మారుతోంది.  ప్రస్తుతం చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్‌ అందిస్తున్నారు. ఇటీవల స్టీల్‌ పైపు ద్వారా చిన్న కెమెరాను లొపలికి పంపించడంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ముఖాలు తొలిసారి కనిపించిన సంగతి విదితమే.

మరిన్ని వార్తలు