ఈ–శ్రమ్‌ పోర్టల్‌లోకి 4 కోట్ల అసంఘటిత కార్మికులు

18 Oct, 2021 04:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రారంభించిన రెండు నెలల్లోపే 4 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల పేర్లు ఈ–శ్రమ్‌ పోర్టల్‌లో నమోదయ్యాయని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ ఆదివారం తెలిపింది. నిర్మాణం, దుస్తుల తయారీ, మత్స్య, వ్యవసాయ, రవాణా తదితర రంగాల్లో ఉపాధి పొందుతున్న వారంతా పేర్లు నమోదు చేయించుకున్నారని పేర్కొంది. చాలా రంగాల్లో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు కూడా ఉన్నారని తెలిపింది. వీరిలో అత్యధిక భాగం నిర్మాణ, వ్యవసాయ రంగాలకు చెందిన వారేనని పేర్కొంది.

ఈ పోర్టల్‌ ఆధారంగానే అసంఘటిత రంగ కారి్మకులకు అన్ని రకాల సామాజిక భద్రత, ఉపాధి ఆధారిత పథకాల ప్రయోజనాలు అందుతాయని వెల్లడించింది. మొత్తం 4.09 కోట్ల అసంఘటిత రంగ కారి్మకుల్లో 50.02% మంది లబి్ధదారులు మహిళలు కాగా 49.98% మంది పురుషులని వివరించింది. వీరి సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోందని కూడా తెలిపింది. నమోదైన వారిలో ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపింది.

నమోదు చేసుకోవాలనుకునే వారు ఈ–శ్రమ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ను గానీ వెబ్‌సైట్‌ను గాని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంకా, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు(సీఎస్‌సీలు), రాష్ట్ర సేవా కేంద్ర, లేబర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లు, గుర్తించిన పోస్టాఫీసులు, డిజిటల్‌ సేవా కేంద్రాలకు వెళ్లాలని వివరించింది. నమోదైన వారికి దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యే డిజిటల్‌ ఈ–శ్రమ్‌ కార్డు అందజేస్తారనీ, వారు తమ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ–శ్రమ్‌ కార్డు కలిగిన వారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవికలత్వం ప్రాపించినా రూ.2 లక్షల పరిహారం అందుతుందనీ, పాక్షిక అంగ వైకల్యమైతే రూ.1 లక్ష సాయం అందుతుందని తెలిపింది.

>
మరిన్ని వార్తలు