యూపీలో దారుణం: ఆక్సిజన్‌ నిలిపివేసి మాక్‌ డ్రిల్‌

8 Jun, 2021 12:53 IST|Sakshi

 ఒ‍క పక్క ప్రాణాలు పోతోంటే.. ఆక్సిజన్‌ నిలిపివేత

ఆసుపత్రి యజమాని ఆడియో సంచలనం

విచారణకు ఆదేశించిన యూపీ సర్కార్‌ 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది.  ఒకవైపు కరోనాతో తీవ్ర అనారోగ్యం , ఆక్సిజన్‌ కొరతతో పేషెంట్లు విల విల్లాడిపోతోంటే..ఆగ్రాలోని పరాస్ ఆసుపత్రిలో కావాలనే "మాక్ డ్రిల్" నిర్వహించిందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏప్రిల్ 27న క్రిటికల్‌ కేర్‌లో ఉన్న పేషెంట్లకు అయిదు నిమిషాల పాటు ఆక్సిజన్‌ సరఫరాను నిలిపివేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.  దీనికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం సంచలన ఆడియో క్లిప్‌  సోషల్‌ మీడియాలో రౌండ్లు కొడుతోంది. దీనిపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

పారాస్ హాస్పిటల్ యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ "మాక్ డ్రిల్" లో భాగంగా ఐదు నిమిషాలు ఆక్సిజన్ సరఫరాను తగ్గించినట్లు చెబుతున్న ఒక ఆడియో  చక్కర్లు కొడుతోంది. ఇదే ఆసుపత్రిలో కోవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు అనుమతి కూడా ఉంది. అయితే తీవ్రమైన ఆక్సిజన్‌  కొరత కారణంగా డిశ్చార్జ్‌ కావాలని ఎన్నిసార్లు చెప్పినా బాధితుల బంధువులు  నిరాకరించడంతో  ఒక ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. దీంతో ఏప్రిల్‌ 27, ఉదయం 7 గంటలకు, తాము ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాను తొలగించామని, దీంతో  ఊపిరాడక 22 మంది రోగుల శరీరాలు నీలం రంగులోకి మారిపోయాయనీ, వారు బతికి ఉండే అవకాశం లేదని ఈ ఆడియోలో జైన్‌ పేర్కొన్నారు. అందుకే ఆక్సిజన్‌ లేకపోతే మనుగడ కష్టమని గ్రహించి మిగిలిన 74 మంది రోగుల కుటుంబ సభ్యులను వారి వారి సొంత ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసుకోమని తెలిపామన్నారు.

ఈ ఆడియో సంచలనంగా మారడంతో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఈ ఆసుపత్రిలో, ఏప్రిల్ 26, 27 తేదీలలో ఏడు కోవిడ్ మరణాలు సంభవించాయనీ, ఈ వీడియోపై దర్యాప్తు చేయనున్నామని ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ మీడియాకు తెలిపారు. మరోవైపు ఈ వీడియోపై జైన్‌ మాట్లాడుతూ ఆడియోలోని తన మాటలను వక్రీకరించారని చెబుతున్నారు. అసుపత్రిలో రోగుల ఆక్సిజన్ డిపెండెన్సీని, ఈ కొరతను అధిగమించేందుకు మాక్‌ డ్రిల్‌ నిర్వహించాం తప్ప,  22 మంది చనిపోయారని తాను చెప్పలేదని వాదించారు. 

దీనిపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. బీజేపీ పాలనలో, ఆక్సిజన్‌, మానవత్వం రెండింటికీ తీవ్రమైన కొరత ఏర్పడిందంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  అలాగే ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆక్సిజన్‌ కొరత సమయంలో ప్రధాని, యూపీ సీఎం యోగి, రాష్ట్రమంత్రి వ్యాఖ్యలను ఉటంకించిన ప్రియాంక గాంధీ, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు