ఆక్సిజన్‌ ట్యాంక్‌ లీక్‌ : 22 మంది మృతి

21 Apr, 2021 14:54 IST|Sakshi

ఆక్సిజన్ ట్యాంక్ లీక్‌. 22 మంది రోగులు దుర్మరణం

ఆ ప్రాంతమంతా వ్యాపించిన గ్యాస్‌

నిలిచిపోయిన ఆక్సిజన్‌ సరఫరా

సాక్షి,ముంబై: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతతో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత పట్టి పీడిస్తోంది. మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ ఆసుపత్రి వద్ద  జరిగిన షాకింగ్‌ ఘటన  తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 22 మంది రోగులు ప్రాణాలు  కోల్పోయారని జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. 

ఆక్సిజన్‌  నింపుతుండగా ఆక్సిజన్ ట్యాంక్ అకస్మాత్తుగా లీక్‌ కావడం ప్రారంభమైంది. దీంతో ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించడంతో అక్కడ తీవ్ర భయాందోళన వాతావరణం ఏర్పడింది. అగ్నిమాపక దళ సిబ్బందిని తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.ఈ పరిణామంతో ఆక్సిజన్ సరఫరా 30 నిమిషాల పాటు నిలిచిపోయింది.  ఫలితంగా ఆక్సిజన్ అవసరమయ్యే 80 మందిలో 31 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. దీనిపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ జాకీర్ హుస్సేన్ స్పందించారు. మరింత సమాచారం సేకరించిన తరువాత ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. (పరిస్థితి చేయిదాటింది.. ప్లీజ్‌.. జాగ్రత్త: ఏడ్చేసిన డాక్టర్‌)

మృతుల బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. నాసిక్ సంఘటనపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్లడించింది. మరోవైపు నాసిక్‌ విషాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కాగా మహారాష్ట్రలో గత 24 గంటల్లో 58,924 కొత్త కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  351 మంది మరణించారు. దీంతోమొత్తం కేసులు 38,98,262కు చేరుకోగా, మరణాల సంఖ్య 60,824కు చేరుకుంది.

చదవండి : సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్‌

మరిన్ని వార్తలు