వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమి.. దేశం ఎప్పుడూ మీ వెంటే: ప్రధాని మోదీ

20 Nov, 2023 08:52 IST|Sakshi

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశం నేడు, ఎప్పుడూ టీమిండియాకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో.. ‘డియర్‌ టీమిండియా. ప్రపంచకప్‌లో ద్వారా మీరు చూపిన ప్రతిభ, పట్టుదల గుర్తించదగినది. గొప్ప స్పూర్తితో ఆడి దేశానికి గర్వకారణంగా నిలిచారు. దేశం ఎప్పుడూ మీకు అండగా, మీ వెంటే ఉంటాం’ అంటూ టీమిండియా జట్టును ఉద్ధేశించి మోదీ ట్వీట్‌ చేశారు.

అదే విధంగా ఆరోసారి వన్డే వరల్డ్‌ కప్‌లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టుకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ టోర్నీలో వారి ఆట ప్రదర్శన ప్రశంసనీయమైనదని.. అద్భుతమైన విజయంతో ముగించారని తెలిపారు. ఫైనల్‌లో అద్భుతంగా ఆడిన ట్రావిస్‌ హెడ్‌కు అభినందనలు తెలిపారు. కాగా మ్యాచ్‌ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌తో కలిసి స్టేడియంలో మ్యాచ్‌ని వీక్షించారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ప్రపంచకప్‌ టైటిల్‌ను మోదీ, ఆసీస్ ఉప ప్రధాని అందించారు.

ఇక వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. భారత్‌ విషాదంగా మెగా టోర్నీని ముగిచింది. లీగ్‌ దశలో టీమిండియా ఆటతీరు చూస్తే కప్‌ ఈసారి మనదే అనిపించగా.అసలు పోరాటంలో మాత్రం అనూహ్యంగా అడుగులు తడబడ్డాయి.. భారతావని క్రికెట్‌ అభిమానులంతా టీమిండియా విజయం కోసం చేసిన పూజలు, మొక్కులు పని చేయక మరోసారి విషాదమే మిగిలింది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్ల తోడాతో టీమిండియా పరాజయం పాలవ్వగా.. అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆ్రస్టేలియా ఆరోసారి వన్డే క్రికెట్‌లో జగజ్జేతగా నిలిచింది.
చదవండి: IND Vs AUS Finals: గుండె ‘పదకొండు’ ముక్కలు! 

మరిన్ని వార్తలు