బీజేపీ కూటమి సర్కార్‌పై సంచలన ఆరోపణలు.. మంత్రి పదవికి ప్రియాంక రాజీనామా

11 Oct, 2023 12:07 IST|Sakshi

చెన్నై: పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఏఐఎన్ఆర్‌సీ-బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి చందిర ప్రియాంగ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు డబ్బు, కుట్రలతో నిండిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో, ఈ ఘటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి చందిర ప్రియాంక తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తాను రాజీనామా చేస్తున్నట్టు ఇన్‌ఛార్జ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రికి రంగస్వామికి లేఖ పంపారు. కాగా, లేఖలో ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాలు కుట్రలతో నిండిపోయాయని, డబ్బుమయంగా మారిపోయాయని అన్నారు. రాజకీయాల్లో కులతత్వం పెరిగిపోయిందని, లింగ వివక్ష సర్వసాధారణంగా మారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

అలాగే, పుదుచ్చేరిలో రెండు ప్రధాన వర్గాలుగా వన్నియర్లు, దళితులు ఉన్నారని, ఈ వర్గాలకు చెందిన శాసనసభ్యులు తమ ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆ వర్గాలు మరింత అభివృద్ధి చెందేందుకు, అవినీతి రహిత రాజకీయాల కోసం తన పదవిని వన్నియర్లు లేదా దళితులు లేదా మైనారిటీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.

ప్రజల మద్దతు లేకపోయినా ధన బలమున్న వారికి ఈ పదవి ఇచ్చి ద్రోహం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుచేయాలని అభ్యర్థించారు. ఇక, ఆమె రాజీనామాపై స్పందించేందుకు ముఖ్యమంత్రి రంగస్వామి నిరాకరించారు. ప్రియాంగ రాజీనామాపై అడిగేందుకు ఆయన చాంబర్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై రంగస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆహ్వానించకుండా ఎందుకు వచ్చారని వారిపై సీరియస్‌ అయ్యారు. 

ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ పోరు.. భారత్‌కు కొత్త సవాల్‌!

మరిన్ని వార్తలు