ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బీజేపీ ఎంపీ కన్నుమూత.. మోదీ సంతాపం

29 Mar, 2023 17:03 IST|Sakshi

ముంబై: బీజేపీ సీనియర్‌ నేత, పుణె ఎంపీ గిరీష్‌ బాపట్‌ కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 72 ఏళ్లు. గిరిష్‌ భగట్‌ మరణాన్ని పుణె నగర బీజేపీ చీఫ్‌ జగదీష్‌ ములిక్‌ ధృవీకరించారు. ఈ సాయంత్రం వైకుంఠ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మరోవైపు, గిరీష్‌ బాపట్‌ మరణం పట్ల మహారాష్ట్ర బీజేపీ సంతాపం తెలిపింది. ఈ విషాదకర సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొంది. 

పుణె లోక్‌సభ సభ్యుడు మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గిరీష్‌ బాపట్‌ మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఎంపీ కుటుంబానికి, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘గిరీష్‌ బాపట్‌ నిరాడంబరమైన వ్యక్తి. కష్టపడి పనిచేసే నాయకుడు, సమాజానికి ఎంతో సేవ చేశారు. మహారాష్ట్ర, ముఖ్యంగా పుణె అభివృద్ధికి విస్తృతంగా కృషి చేశారు. ఆయన మృతి బాధాకరం. కుటుంబ సభ్యులకు సంతాపం. ఓం శాంతి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా అమరావతి జిల్లాకు చెందిన బాపట్‌.. తొలుత ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు పాలైన ఆయన.. కస్బాపేట్‌ నియోజకవర్గం నుంచి అదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో పుణె నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర పౌర సరఫరాలశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాపట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బుధవారం తెల్లవారుజామున పుణెలోని దీనానాథ్ ఆసుపత్రిలో చేరారు.  చికిత్స పొందుతూ నేడు మరణించారు.

మరిన్ని వార్తలు