ఈత కొట్టారు.. చేపలు పట్టారు

25 Feb, 2021 04:20 IST|Sakshi

జాలర్లతో కలిసి రాహుల్‌గాంధీ సముద్రయానం

మత్స్యకారుల సమస్యలన్నీ మ్యానిఫెస్టోలో చేరుస్తామని హామీ

కొల్లాం: కేరళలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అతి పెద్ద సాహసమే చేశారు. కొల్లాం సముద్రంలో వారితో కలసి చేపలు పట్టే ప్రయత్నం చేశారు. మధ్యలో హఠాత్తుగా సముద్రంలోకి దూకి కాసేపు ఈత కొట్టారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ బుధవారం తెల్లవారుజామున వాడి బీచ్‌ నుంచి మత్స్యకా రులతో కలిసి సముద్రంలోకి వెళ్లారు.

మీ పని అంటే గౌరవం
పడవ తిరిగి ఒడ్డుకు వచ్చాక థంగస్సెరీ బీచ్‌ దగ్గర మత్స్యకారులనుద్దేశించి రాహుల్‌ ఉద్వేగభరితంగా  మాట్లాడారు. కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం చేపలు పట్టడానికి సముద్రంలో ట్రాలర్లు ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చు కోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. ఈ ఒప్పందం వల్ల జాలర్లు జీవనోపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మీరు చేసే పనిని నేను ఎంతో గౌర విస్తాను. ఆరాధిస్తాను. మేము లొట్టలేసుకుంటూ చేపలు తింటూ ఉంటాం. కానీ అవి మా ప్లేట్‌లోకి రావడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు ఇవాళే అర్థమైంది’’ అని రాహుల్‌ అన్నారు.

సముద్రంలో సాహసం
వల వేశాక మత్స్యకారులతో కలసి రాహుల్‌ కూడా సముద్రంలో దిగారు. హఠాత్తుగా సముద్రంలోకి దూకి ఈత కొట్టారు. దాదాపు 10 నిమిషాలు ఈత కొట్టినట్టుగా ఆయనతో పడవలో ప్రయాణించిన కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పారు. ఎవరితో చెప్పకుండా హఠాత్తుగా దూకడంతో భయపడినట్లు చెప్పారు.

హమ్‌ దో.. హమారే దో!
గుజరాత్‌లో నూతనంగా నిర్మించిన మొతెరా స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యంగాస్త్రాలు విసిరారు. ‘హమ్‌ దో.. హమారే దో(మేమిద్దరం.. మాకిద్దరు)’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో బుధవారం ఒక వ్యంగ్య వ్యాఖ్యను ట్వీట్‌ చేశారు. ‘వాస్తవాలు ఎంత అందంగా బయటపడుతున్నాయో చూడండి. స్టేడియం పేరు నరేంద్ర మోదీ స్టేడియం. ఒక ఎండ్‌ పేరు అదానీ ఎండ్, మరో ఎండ్‌ పేరు రిలయన్స్‌ ఎండ్‌. పరిపాలన బాధ్యతల్లో జే షా’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. స్టేడియం పేరును ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంగా, స్టేడియంలోని రెండు ఎండ్‌లను అదానీ, రిలయన్స్‌ ఎండ్స్‌గా నిర్ణయించడాన్ని రాహుల్‌ ఇలా ఎద్దేవా చేశారు. కాగా, ఈ పేరు మార్పు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించింది. కేవలం స్టేడియం పేరును మాత్రమే మార్చామని, మొత్తం స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పేరు సర్దార్‌ పటేల్‌ పేరుపైననే కొనసాగుతుందని వివరణ ఇచ్చింది.  

ప్రధాని దార్శనికతకు గౌరవం..
గుజరాత్‌లో నిర్మించిన స్టేడియానికి ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా నామకరణం చేయడాన్ని బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా సమర్ధించారు. ఇది క్రీడారంగంలో భారత్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ దార్శనికతను గౌరవించే వినమ్ర ప్రయత్నమని అభివర్ణించారు. స్టేడియానికి సర్దార్‌ పటేల్‌ పేరు తొలగించి, ప్రధాని మోదీ పేరు పెట్టడంపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పించడంతో బీజేపీ నాయకులు స్పందించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ ఏ నాడూ గౌరవించలేదని ఆరోపించారు. అంతకుముందు, పటేల్‌ పేరును తొలగించి స్టేడియానికి మోదీ పేరు పెట్టడం సర్దార్‌ పటేల్‌నే కాదు.. భారతీయులని అవమా నించడమేనని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు.

మరిన్ని వార్తలు