తెలంగాణకు కాంగ్రెస్‌ ఏం చేసిందో నేను చెప్తా కేసీఆర్‌: రాహుల్‌

17 Nov, 2023 13:31 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పదేళ్లు తెలంగాణను దోచుకున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అంతం పలికే రోజు వచ్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఎన్ని లక్షల కోట్లను కేసీఆర్‌ అవినీతి చేశారో.. అంత డబ్బును పేదల అకౌంట్లలో వేస్తామని తెలిపారు.  పినపాకలో రాహుల్‌ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో తానే స్వయంగా వెళ్లి చూశానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లను దోచుకున్నారని మండిపడ్డారు. 

తెలంగాణలో 24 గంటల కరెంట్‌ కేవలం కేసీఆర్‌ ఇంట్లోమాత్రమే వస్తుందని రాహుల్‌ విమర్శించారు. కేసీఆర్‌ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందో తాను చెబుతానని అన్నారు. మీరు చదివిన స్కూల్‌, నడిచే రోడ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీ వేసిందేనని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ 500 కే ఇవ్వబోతున్నామని,  ప్రతి నెల మహిళల అకౌంట్లో నెలకు 2.500 వేస్తామని అన్నారు. 

‘కాంగ్రెస్‌ ఏం చేసిందని కేసీఆర్‌ అడుగుతున్నారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్‌. ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ సీఎం అమలు చేస్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్‌ నెరవేరుస్తుంది. తెలంగాణలో కులగణనను జరిపిస్తాం. స్థానిక సంస్థల్లోనూ బీసీల రిజర్వేషన్లు పెంచుతాం. కాంగ్రెస్‌ అంటే కుటుంబ పాలన కాదు ప్రజా ప్రభుత్వం. 20 లక్షల మంది రైతులను ధరణి పేరుతో మోసం చేశారు. ధరణితో మోసపోయిన రైతులకు మీ భూములు మీకు ఇప్పిస్తాం. 

తెలంగాణలో కాంగ్రెస్‌ తుపాన్‌ మొదలైందని కేసీఆర్‌కు అర్థమైంది. కాంగ్రెస్‌ తుపాన్‌లో కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోతుంది. తెలంగాణ ఒక కుటుంబం కోసం ఏర్పడలేదు.  బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం.. మూడు పార్టీలు ఒక్కటే. ఎక్కడ కాంగ్రెస్‌, బీజేపీ పోటీ ఉంటుందో అక్కడ కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడానికి ఎంఐఎం ఉంటుంది. ఇక్కడ కేసీఆర్‌, కేంద్రంలో మోదీని అధికారంలో నుంచి దించేస్తాం’ అని పినపాక సభలో రాహుల్‌ వ్యాఖ్యానించారు.
చదవండి: Tandur: ఓ పార్టీ  నుంచి అడ్వాన్స్‌ తీసుకుని.. మరో పార్టీలోకి జంప్‌

మరిన్ని వార్తలు