Rajasthan: అసెంబ్లీ ఎన్నికల కోసం ఒకే ఎత్తుగడతో ఇరు పార్టీలు! ఏది హిట్‌ అవుతుందో?

21 Nov, 2023 13:50 IST|Sakshi

రాజస్థాన్‌ అసెం​బ్లీ ఎన్నికలు ఈ నెల 25న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల వ్యూహాలు, ఓటర్లను ఆకర్షించేలా అగ్రనేతలతో ప్రచార ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ‘తగ్గేదేలే’ అన్నట్టుగా సరికొత్త ఎత్తుగడలతో పావులు కదుపుతున్నారు. కుల ప్రాతిపదికన ఓట్లు పొందే వ్యూహంతో ఇరు పార్టీలో బరిలోకి దిగుతున్నాయి.

జాట్‌ల ఆధిక్యం గల హనుమాన్‌గఢ్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ..తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల సర్వే చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేగాక పార్టీ మేనిఫెస్టోలో కూడా కుల గణనకే పెద్ద పీఠ వేస్తూ పలు హామీలను అందించింది. 

ఇదిలా ఉండగా, చిత్తోర్‌గఢ్‌లో ఓ పండ్ల విక్రేత తాను ఓబీసీనని, ఎప్పుడూ బీజేపీకి ఓటు వేస్తానని చెప్పాడు. అయితే తమకు గెహ్లోత్‌ ప్రభుత్వం సమస్తమూ ఇచ్చిందన్నారు. తాను ఉచిత విద్యుత్‌ నుంచి  పిల్లలకు మధ్యాహ్న భోజనం, తల్లికి వృద్ధాప్య పింఛన్‌ తదితర అన్నింటిని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పోందానని చెప్పాడు. అయితే అక్కడ చాలమంది ప్రజలు బీజేపీకి ఓటేస్తానని చెప్పడం విశేషం. 

ఇక రాజస్థాన్‌కి ఉత్తరంగా ముఖ్యంగా జాట్‌లు అధిక్యంగా ఉన్న జైపూర్‌లో బీజేపీ పట్ల విముఖత ఎక్కువుగా ఉంది. ఎందువల్ల?.. అంటే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జాట్‌కి చెందిన సతీష్‌ పునియాను తొలగించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదీగాక ఇక్కడ భారత రెజ్లర్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై దిగ్గజ రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ఆయన ఇంకా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగటమే అక్కడ ప్రజలకు మింగుడుపడని అంశమే గాక బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకతకు ప్రధాన కారణం కూడా. కులాల పరంగా ఎక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్న రాజస్తాన్‌లో ఓబీసీ ఓటర్లే ఇరు పార్టీల ప్రధాన ఓటు బ్యాంక్‌ అని చెప్పాలి. దీంతో ఆ దిశగానే కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు పాచికలు కదుపుతూ తమదైన వ్యూహంతో ప్రచార ర్యాలీలు నిర్వహించడమే గాక, హామీలు ఇచ్చాయి.

అదీగాక రాజస్థాన్‌ అసెంబ్లీలోని 200 స్థానాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలో సుమారు 30% వరకు ఓబీసీ వర్గానికి చెందిన వారే. ఐతే బీజేపీ రాజస్తాన్‌లో 25 పార్లమెంటరీ స్థానాలను కలిగి ఉంది. అందులో ఉన్న 11 మంది ఎంపీలు ఓబీసీలే కావడం విశేషం. 2011 జనాభా లెక్కల ప్రకారం..షెడ్యూల్డ్ కులాలు 17.8%, షెడ్యూల్డ్ గిరిజన తెగలు 13.5% ఉండగా, ఓబీసీ ఎంతమంది ఉన్నారనేది సంఖ్యాపరంగా కచ్చితమైన గణాంకాలు లేనప్పటికీ సుమారు 30 నుంచి 40% దాక ఉంటారనే అంచనా.

ఇక్కడ జాట్‌లే ఆధిపత్య ఓబీసీలు. అదీగాక రాజస్థాన్‌లో పార్టీ టిక్కెట్ల విషయంలో ఓబీసీలు రాజకీయంగా పలు వేధింపులకు గురవ్వుతున్నారు కూడా. కాబట్టి వీటన్నింటిని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు దృష్టిలో ఉంచుకునే.. ఓబీసీలకు కాంగ్రెస్‌ 72, బీజేపీ 70 టిక్కెట్లు కేటాయించింది. కాగా, ఈ ఎన్నికల్లో ఆ ఇరు పార్టీల్లో ఎవరి ఎత్తుగడ, హామీలు హిట్‌ అవుతుందనేది ఓటర్లే నిర్ణయించాల్సి ఉంది. 

(చదవండి: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వరాల జల్లు!)

మరిన్ని వార్తలు