-

Uttarakhand: రెస్క్యూ బృందాలకు 5 మీటర్ల దూరంలో కార్మికులు

28 Nov, 2023 11:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తు‍న్నాయి. గత 17 రోజులు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సొరంగంలోని బండరాళ్లను తవ్వే క్రమంలో అవంతరాలు ఎదురవ్వడంతో రెస్క్యూ ప్లాన్‌లను మార్చి మార్చి అమలు చేస్తున్నారు. శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్‌ పనులను పక్కనపెట్టి.. కొండపై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్‌ పనులను సోమవారం మొదలు పెట్టారు.

ఇక ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌’ బృందానికి చెందిన అనుభవజ్ఞులైన 24 మంది మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ముందుగా 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్‌ పైపు నుంచి డ్రిల్లింగ్‌ మెషీన్‌ బ్లేడ్లను తొలగించి.. అదే మార్గంలో దూరిన కార్మికులు.. సొరంగానికి మ్యాన్యువల్‌గా రంధ్రం చేయడం ప్రారంభించారు. ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ కార్మికులు మాన్యువల్‌ డ్రిల్లింగ్‌ ద్వారా పైచి శిథిలాలను బయటకు తీస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు దాదాపు 2 మీటర్ల మేర మాన్యువల్‌ డ్రిల్లింగ్‌ పూర్తయింది.
చదవండి: ఏమిటీ ర్యాట్‌–హోల్‌ పద్ధతి?

మరోవైపు టన్నెల్‌ పైభాగం నుంచి వర్టికల్‌ డ్రిల్లింగ్‌ పనులు కూడా కొనసాగుతున్నాయి. 86 మీటర్లు తవ్వాల్సి ఉండగా.. మంగళవారం ఉదయం నాటికి 51 మీటర్ల మేర మైక్రో టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెస్క్యూ బృందాల నుంచి కార్మికులు కేవలం 5 మీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అయిదు  మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయితే కార్మికులను చేరుకోనున్నారు. ఈ పద్దతి ద్వారా గురువారం నాటికి కార్మికులను బయటకు తీయాలని అధికారులు భావిస్తున్నారు.

కాగా రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రుగుతున్న ట‌న్నెల్ వ‌ద్ద‌కు నేడు ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ థామి వెళ్లారు. సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. ఇక ఛార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా రోడ్డుమార్గంలో ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సిల్‌క్యారా–బార్కోట్‌ మార్గంలో సొరంగం నిర్మిస్తుండగా నవంబర్‌ 12వ తేదీన లోపల కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు రెండు కిలోమీటర్ల పొడవైన భాగంలో చిక్కుకుపోయారు.
చదవండి: ఉత్తరాఖండ్‌: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు!

మరిన్ని వార్తలు