ఆర్కే కన్నుమూత

15 Oct, 2021 01:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే (66) మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని దక్షిణ బస్తర్‌ అటవీప్రాంతంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయన బుధవారం మృతిచెందినట్టు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు గురువారం తెలిసింది. ఆర్కే మృతిచెందినట్టు తమకు సమాచారం అందిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఆర్కే మృతిపై తమకు సమాచారం లేదని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు.

దేశంలోనే మావోయిస్టు కీలక అగ్రనేతల్లో ఒకరుగా ఉన్న గుర్తింపు పొందిన ఆర్కే దీర్ఘకాలంగా మధుమేహం, కీళ్ల నొప్పులు, స్పాండిలైటిస్, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. అయినప్పటికీ బీజాపూర్‌ జిల్లా అటవీప్రాంతంలో ఉంటూ స్థానికంగా వైద్యం చేయించుకున్నారుగానీ బయటకు వచ్చేందుకు సుముఖత చూపలేదు. మూడురోజుల కిందట పరిస్థితి విషమించిన ఆయన మూత్రం కూడా బంద్‌ అవడంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. బీజాపూర్‌ అటవీప్రాంతంలోనే గురువారం అంత్యక్రియలు కూడా నిర్వహించినట్టు పోలీసువర్గాలు తెలిపాయి. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని తుమృకోట. ఆయనకు భార్య కందుల నిర్మల అలియాస్‌ శిరీష అలియాస్‌ పద్మ ఉన్నారు.

ఆయన కుమారుడు శివాజి అలియాస్‌ పృథ్వి అలియాస్‌ మున్నా 2016లో రామగూడ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. మావోయిస్టు ఉద్యమంలో నాలుగు దశాబ్దాల పాటు కీలకనేతగా ఉన్న ఆర్కేపై దేశవ్యాప్తంగా 200కిపైగా కేసులున్నాయి. 2003లో అలిపిరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్లెమోర్‌మైన్స్‌తో దాడి కేసు కూడా ఆయనపై ఉంది. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టు ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహించారు. గతంలో ఎన్నోసార్లు పోలీసు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. కొన్నేళ్లుగా బలహీనపడిన మావోయిస్టు పార్టీకి ఆర్కే మృతి తీవ్రనష్టమని పరిశీలకులు చెబుతున్నారు.  

నల్లమల, ఏవోబీ కార్యక్షేత్రాలు 
గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోటకు చెందిన ఆర్కే 1975లో అప్పటి పీపుల్స్‌వార్‌ ఉద్యమంవైపు ఆకర్షితులయ్యారు. 1977 నుంచి పీపుల్స్‌వార్‌ పార్టీలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించారు. నాలుగు దశాబ్దాల ఉద్యమ జీవితంలో ఆర్కే ప్రధానంగా నల్లమల, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లను కేంద్రస్థానాలుగా చేసుకుని పీపుల్స్‌వార్‌/మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆర్కే 1977లో పీపుల్స్‌వార్‌ పార్టీలో నల్లమల దళం ఏర్పాటు చేసి 1982 వరకు ఉద్యమాన్ని బలోపేతం చేశారు. గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి నుంచి నాగార్జునసాగర్‌ వరకు నల్లమల దళాన్ని విస్తరించారు. స్థానికుల మద్దతు కూడగట్టి నాగార్జున బ్యాక్‌వాటర్‌ గుండా రాకపోకలు సాగిస్తూ చాపకింద నీరులా ఉద్యమాన్ని బలోపేతం చేశారు.

1984 నుంచి కొన్నేళ్లు నల్లమల దళం కార్యకలాపాలు తగ్గి, నక్సలైట్‌ ఉద్యమం నెమ్మదించింది. మళ్లీ 1990 నుంచి నల్లమలలో నక్సలైట్‌ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 1999–2000లో ఆర్కేను పీపుల్స్‌వార్‌ పార్టీ దండకారణ్యం పంపించింది. ఏవోబీ కార్యదర్శిగా ఆర్కే భారీగా రిక్రూట్‌మెంట్లు చేసి 2003 నాటికి దాదాపు 500 మందితో ఏవోబీ దళాన్ని పటిష్టం చేశారు. పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీసీఐ) పార్టీలు విలీనమై 2004లో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించడంలో ఆర్కే కీలకపాత్ర పోషించారు. అనంతరం కూడా ఆయన ఆంధ్ర–ఒడిశా–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఏవోబీ కార్యదర్శిగా, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు.

మావోయిస్టు కేంద్ర కమిటీని కూడా శాసించేస్థాయికి ఎదిగారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా గణపతి ఉన్నప్పటికీ ఆర్కేదే పైచేయిగా ఉండేదని చెబుతారు. ఒకానొక సమయంలో ఆర్కేను మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అవుతారని భావించారు. అనారోగ్య కారణాలతో ఆయన అందుకు సుముఖత చూపలేదని చెబుతారు. 2009 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు పార్టీ బాగా బలహీనపడటంతో ఆర్కే ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు పార్టీ వ్యవహారాల నుంచి 2020లో పూర్తిగా దూరం జరిగిన ఆయన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకే పరిమితమయ్యారు.  

రూ.కోటిన్నరకుపైగా రివార్డు 
పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త రిక్రూట్‌మెంట్లు, మిలటరీ ఆపరేషన్లలో ఆర్కే ఆరితేరారు. చుండూరు మారణహోమానికి ప్రతీకారంగా దగ్గుబాటి చెంచురామయ్యను పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు హత్యచేసిన దాడికి నేతృత్వం వహించారు. 2003లో తిరుపతిలోని అలిపిరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్లెమెర్‌మైన్స్‌తో దాడి వెనుక మాస్టర్‌ బ్రెయిన్‌ ఆర్కేనే. ఆ కేసులో ప్రధాన నిందితుల్లో ఆయన ఒకరు. 2003 ఏప్రిల్‌ 2న జరిగిన అప్పటి పెద్దారవీడు ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల కిడ్నాప్‌లో ఆర్కే ప్రమేయం ఉందని చెబుతారు.

2005లో ప్రకాశం జిల్లా ఎస్పీ మహేశ్‌చంద్ర లడ్హాపై హత్యాయత్నం, 2008లో ఒడిశాలోని బలిమెల రిజర్వాయర్‌లో గ్రేహౌండ్స్‌ దళాలపై కొండలపై నుంచి కాల్పులు జరిపి 37 మందిని బలిగొన్న కేసులో నిందితుడు. 2011లో ఒడిశాలోని మల్కనగిరి కలెక్టర్‌ వినీల్‌కృష్ణ కిడ్నాప్‌ వెనుక ఉన్నదీ ఆర్కేనే. ఇలా దాదాపు 200కిపైగా కేసుల్లో నిందితుడైన ఆర్కేపై పలు రాష్ట్రాల్లో రివార్డులున్నాయి. మహారాష్ట్రలో రూ.50 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.40 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.25 లక్షలు, ఒడిశాలో రూ.20 లక్షలు, జార్ఖండ్‌లో రూ.12 లక్షల వంతున.. ఇతరత్రా మొత్తంగా రూ.1.52 కోట్ల రివార్డు ఉంది. 

నల్లమల నుంచి బయటకు వచ్చి ప్రభుత్వంతో చర్చలు 
2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని నిర్ణయించింది. అప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టుల ప్రతినిధి బృందానికి ఆర్కే నేతృత్వం వహించారు. దీంతో ఆయన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా గుర్తింపు పొందారు. పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నల్లమల ప్రాంతం నుంచే ఆర్కే నేతృత్వంలో మావోయిస్టులు బయటకు వచ్చారు. 2004 సెప్టెంబర్‌ 14న దోర్నాల మండలం చిన్నారుట్ల నుంచి బయటకు వచ్చారు. అనంతరం గురజాల నియోజకవర్గంలోని గుత్తికొండ బిలం వద్ద బహిరంగసభ నిర్వహించారు. తరువాత హైదరాబాద్‌ వెళ్లి ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపారు.  

ఎన్నోసార్లు.. ప్రాణాలతో బయటపడిన ఆర్కే 
నాలుగు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలో ఆర్కే ఎన్నోసార్లు ఎన్‌కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆర్కే చుట్టూ బలమైన అంగరక్షక వ్యవస్థ ఉండేది. 1991లో నల్లమలలో ఎన్‌కౌంటర్‌ నుంచి 2016లో రామగూడ ఎన్‌కౌంటర్‌ వరకు ఆయన దాదాపు 20 ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. నల్లమల, లందుల, దొరగూడ, దల్దాలి, టక్కరపడ, బెజ్జంగి, బడ్జేడు, రామగూడ తదితర ఎన్‌కౌంటర్ల నుంచి ఆయన బయటపడ్డారు. 2006 జూలై 23న యర్రగొండపాలెం మండలం చుక్కలకొండ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అప్పటి రాష్ట్ర కార్యదర్శి మాధవ్, మరో ఏడుగురు చనిపోగా ఆర్కే తప్పించుకున్నారు.

ప్రకాశం జిల్లాలో పాలుట్ల అటవీ ప్రాంతం దగ్గర, పెద్దదోర్నాల మండలంలోని చిన్నారుట్ల అటవీ ప్రాంతం దగ్గర జరిగిన ఎదురు కాల్పుల్లో కూడా తప్పించుకున్నారు. 2008లో నల్లమలలో పోలీసు బలగాలు ఆయన్ని దాదాపు చుట్టుముట్టాయి. కనుచూపుమేరలో ఉన్న ఆర్కే ఇక దొరికిపోవడమో.. ఎన్‌కౌంటరో.. అనే సమాచారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంతటా గుప్పుమంది. కానీ చివరి నిమిషంలో ఆశ్చర్యకరంగా ఆయన తప్పించుకున్నారు.  అప్పటినుంచి కొన్ని పదులసార్లు ఎన్‌కౌంటర్‌లో ఆర్కే చనిపోయారని వార్తలు గుప్పుమనడం, తరువాత అది అవాస్తవమని తేలడం పరిపాటిగా మారిపోయింది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నరాజముల తండా వద్ద  2010 మార్చి 12న జరిగిన ఎన్‌కౌంటర్‌ నుంచి ఆర్కే తప్పించుకోగా రాష్ట్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు ప్రాణాలు కోల్పోయాడు.

2016లో రామగూడ ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్‌ గాయాలైన ఆర్కేని అంగరక్షకులు సురక్షితంగా తప్పించారు. ఆర్కే ఏకైక లక్ష్యంగా ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు లెక్కకుమించి ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. కానీ అవేవీ ఫలించలేదు. పలుమార్లు ఎన్‌కౌంటర్లలో ఆయన అంగరక్షకులు మృతిచెందారు. ఆయన మాత్రం దొరకలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కేతో సంప్రదింపులు జరిపి ఆయన లొంగిపోయేలా చేసేందుకు నాలుగు రాష్ట్రాల పోలీసులు ప్రయత్నించారు. ప్రధానంగా గత ఏడాది కరోనా వ్యాప్తి తదనంతర పరిస్థితుల్లో ఈ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఆయన లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని కూడా చెప్పారు. కానీ లొంగిపోయేందుకు ఆర్కే సమ్మతించ లేదు.  

ఎన్‌కౌంటర్‌లో కుమారుడు మృతి 
ఆర్కే ఒకే ఒక కుమారుడు పృథ్వి అలియాస్‌ మున్నా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. 2004లో ప్రభుత్వంతో చర్చల తరువాత ఆర్కే కుమారుడు పృథ్వి అలియాస్‌ మున్నా కూడా మావోయిస్టు ఉద్యమంలో చేరారు. ఆయన 2016లో రామగూడ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. ఆ ఎన్‌కౌంటర్‌ సమయంలో ఆయన తన తండ్రి ఆర్కే అంగరక్షక దళ సభ్యుడిగా ఉన్నారు. ఆ ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్‌ గాయమైన ఆర్కే తప్పించుకోగా.. మున్నా ప్రాణాలు కోల్పోయారు.

>
మరిన్ని వార్తలు