తండ్రి ప్రేమకు పరాకాష్ట.. కన్నీరు పెట్టిస్తున్న వాంగ్మూలం!

26 Jun, 2023 11:02 IST|Sakshi

ఏసీ కూలింగ్‌ విషయమై ఆ తండ్రీ కొడుకుల మధ్య వివాదం జరిగింది. ఆగ్రహంతో రగిలిపోయిన కుమారుడు వెంటనే తుపాకీ తీసుకుని, తండ్రిపై తూటాల వర్షం కురిపించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులతో ఏమి చెప్పాడో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. 

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ జిల్లాలో ఆ సమయంలో కలకలం చెలరేగింది. ఏసీ కూలింగ్‌ విషయమై జరిగిన వివాదంలో కుమారుడు తండ్రిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటాలు ఆ వృద్ధుడైన ఆ తండ్రి రెండు కాళ్లలోకి దూసుకుపోయాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మరింత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని అమృత్‌సర్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు.

ఈ ఘటన హోషియార్‌ పూర్‌ జిల్లాలోని జలాల్‌చక్క గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వీర్‌సింగ్‌ తన కుమారుడు అమర్‌సింగ్‌తో పాటు ఇంటిలో ఉంటున్నాడు. వారి ఇంటిలోని ఏసీ సరైన చల్లదనాన్ని అందించడం లేదు. దీంతో కుమారుడు ఏసీకి మరమ్మతు చేయించాలని తండ్రికి చెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం జరిగింది.

‘వాడు తప్పు చేశాడని.. నేను చేయను’
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి పోలీసులతో మాట్లాడుతూ..‘ నా కొడుకు మద్యం మత్తులో ఉన్నాడు. వాడు ఆగ్రహంతో లైసెన్స్‌ కలిగిన తుపాకీతో నాపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నా రెండు కాళ్లలోకి బుల్లెట్లు దిగాయి. వాడు మద్యం మత్తులో తప్పు చేశాడు. నేను వాడికి తండ్రిని అయిన కారణంగా అతనిని అరెస్టు చేయించి, తప్పు చేయలనుకోవడం లేదు. నా కుమారునిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వేడుకుంటున్నాను’ అని అన్నాడు. 

ఘటన ఆధారంగా దర్యాప్తు: పోలీసులు
ఈ ఉదంతంపై పోలీసు అధికారి బల్విందర్‌ సింగ్‌ మాట్లాడుతూ సమాచారం అందగానే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని అన్నారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందున్నాడు. ఘటనపై తమకు ఫిర్యాదు చేసేందుకు నిరాకరిస్తున్నాడు. ఒకవేళ అతను కుమారునిపై ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామన్నారు. 

ఇది కూడా చదవండి: ‘ఇక చూసింది చాలు పడుకో’ అని తల్లి అనడంతో..

మరిన్ని వార్తలు