తాజ్‌ సందర్శకునికి గుండెపోటు.. సీపీఆర్‌ ఇచ్చి కాపాడిన కుమారుడు!

16 Nov, 2023 07:42 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో గల తాజ్‌ మహల్‌ చూసేందుకు వచ్చిన ఒక వృద్ధుడు గుండెపోటుకు గురయ్యాడు. అయితే వెంటనే స్పందించిన అతని కుమారుడు సీపీఆర్‌ (కార్డియో-పల్మనరీ రిససిటేషన్) చేయడంతో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో పలు సోషల్‌ మీడియా మాధ్యమాలలో వైరల్‌గా మారింది.  

వివరాల్లోకి వెళితే ఒక వృద్ధుడు కుటుంబ సమేతంగా తాజ్ మహల్ సందర్శనకు వచ్చాడు. అతను తాజ్‌మహల్‌ కాంప్లెక్స్ లో గుండెపోటుకు గురయ్యాడు. అతని కుమారుడు వెంటనే తండ్రికి సీపీఆర్‌ ఇచ్చి అతని ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటనను పలువురు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు.  గుండెపోటుకు గురైన వారికి వెంటనే సీపీఆర్‌ ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు నిలబెట్టవచ్చని ఈ వీడియో తెలియజేస్తోంది. 

సీపీఆర్‌తో కోలుకున్న బాధితుడిని తక్షణం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గుండెపోటుకు గురైన బాధితులకు చికిత్స అందించేందుకు వైద్య సహాయం అందేలోగా సీపీఆర్‌ చేయడం ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. బాధితుని శరీరంలో రక్తప్రవాహం కొనసాగేందుకు సీపీఆర్‌ సహాయ పడుతుంది. తద్వారా వారి ప్రాణాలు నిలిచే అవకాశం మూడు రెట్లు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలివే..
 

మరిన్ని వార్తలు