పగడ్బందీ వ్యూహంతో వీరప్పన్‌ను హతమార్చాం 

21 Dec, 2022 07:35 IST|Sakshi

సాక్షి, చెన్నై(కొరుక్కుపేట): పగడ్బందీ ప్రణాళికలు, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం నేర్పుతో గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ను హతమార్చామని తమిళనాడు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌)కి నాయకత్వం వహించిన మాజీ ఐపీఎస్‌ అధికారి కె.విజయ్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం చెన్నై తరమణిలోని ఏసియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజంలో జరిగిన కార్యక్రమంలో.. మాజీ ఐపీఎస్‌ అధికారి విజయకుమార్‌ రాసిన (వీరప్పన్‌ ఛేజింగ్‌ ది బ్రిగాండ్‌) పుస్తకం ఆధారంగా 20 ఎపిసోడ్‌ల ఆడియో రికార్డులను  ఆసియావిల్లే వ్యవస్థాపకుడు, సీఈఓ  తుహిన్‌ ఆవిష్కరించారు.


మాట్లాడుతున్న మాజీ ఐపీఎస్‌ అధికారి విజయ్‌ కుమార్‌  

ఈ సందర్భంగా థ్రిల్లింగ్‌ ట్రూ–క్రైమ్‌ పై ఆడిబుల్‌ ఒరిజినల్‌ పాడ్‌కాస్ట్‌ సర్వీస్‌ను ప్రారంభించారు. ఇందులో 1952లో గోపీనాథంలో పుట్టినప్పటి నుంచి 2004లో మరణించే వరకు వీరప్పన్‌ జీవితానికి సంబంధించిన అంశాలు మాజీ ఐపీఎస్‌ కె. విజయ్‌ కుమార్‌ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించామని వివరించారు.

అనంతరం ఇందులో పాల్గొన్న విజయకుమార్‌ మాట్లాడుతూ మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్‌ను ఎలాగైనా మట్టికరిపించాలనే లక్ష్యంతో పక్కా వ్యూహంతో హతమార్చగలిగామన్నారు. ఇందులో ఏకే 47 గన్‌ను వినియోగించామని చెప్పారు. ఎంతో మంది పోలీసులను, సాధారణ ప్రజలను కిరాతకంగా వీరప్పన్‌ చంపారని గుర్తు చేశారు. లా అండ్‌ ఆర్డర్‌కు ఎవరూ భంగం కలిగించినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందే విషయాన్ని ఈ ఆపరేషన్‌ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేశాం.. అని ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు