SC On YS Viveka Case : పోలీస్‌ ఫైల్‌ ఒరిజినల్‌ రికార్డు ఇవ్వండి

18 Jul, 2023 11:56 IST|Sakshi

సుప్రీంకోర్టు ముందుకు సునీత పిటిషన్‌

కౌంటర్‌ దాఖలు చేయాలని CBIకి సూచన

ఏపీ పోలీసులు ఏం తేల్చారు? మీరేం చేస్తున్నారు?

పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వండి

కేసును సెప్టెంబర్‌ 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

సాక్షి, న్యూఢిల్లీ

వివేకా హత్య కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్‌ ఇవ్వాళ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కేసును విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం.. ఈ వ్యవహారంలో పూర్వపరాల గురించి అడిగింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు గడువు ముగియడంతో.. సిబిఐ తన కౌంటర్ దాఖలు చేయలేదు.

సునీత ఏం కోరింది? 
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిబిఐ చేసిన దర్యాప్తుకు సంబంధించిన కేసు డైరీ వివరాలను తనకు ఇవ్వాలంటూ పిటిషనర్‌ సునీత సుప్రీంకోర్టును అడిగింది. పిటిషనర్‌ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కీలకమైన ఈ వ్యవహారంలో ఈ పరిస్థితుల్లో కేసు డైరీ వివరాలను పిటిషనర్‌కు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది.

గంగిరెడ్డి లాయర్ ఏం కోరారు? 
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ దర్యాప్తు పూర్తయిందని, ఈ నేపథ్యంలో గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని ఆయన తరపు లాయర్ కోరారు. ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసు చాలా సీరియస్ అంశం అని పేర్కొన్న సుప్రీం కోర్టు, సునీత పిటిషన్ తో పాటు గంగిరెడ్డి బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. 

ఏపీ పోలీసులు ఏం కనుగొన్నారు? సిబిఐ ఏం తేల్చింది?
వివేకానందరెడ్డి హత్య 15 మార్చి, 2019న జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని కూడా నియమించింది. ఆ కేసును క్షుణ్ణంగా విచారణ చేసిన నాటి ఏపీ పోలీసులు.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తమ నివేదికను CBIకి అప్పగించారు. ఈ నేపథ్యంలో అసలు అప్పటి పోలీసులు ఏమని నివేదించారు? ఇప్పుడు తాజాగా CBI దర్యాప్తులో ఏం కనిపెట్టిందన్న అంశాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలని సిబిఐకి ఆదేశించింది. 

CBIకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటీ?

  • ఈ కేసులో రెండు వారాల్లో రిప్లై పిటిషన్‌ దాఖలు చేయాలి
  • నోటీసులపైన రిజాయిండర్లు మూడు వారాల్లో దాఖలు చేయాలి
  • జూన్ 30న దాఖలు చేసిన చార్జిషీట్ కాపీని తమ ముందు  ఫైల్ చేయాలి
  • వివేకానంద రెడ్డి హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులను సీల్డ్ కవర్లో ఇవ్వాలి

అనంతరం ఈ కేసులో తర్వాతి విచారణను సెప్టెంబర్ 11 కు వాయిదా  వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఇతర ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. 
 

మరిన్ని వార్తలు