సుప్రీంకోర్టులో హేమంత్‌ సోరెన్‌కు ఎదురుదెబ్బ

2 Feb, 2024 09:28 IST|Sakshi

సుప్రీంకోర్టులో జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోలేమని.. ముందుగా హైకోర్టుకు వెళ్లాలని తెలిపింది. కాగా భూ కుంభకోణంలో తన అరెస్టు అక్రమమంటూ సోరెన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లను చట్టవిరుద్ధం, తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనంటూ పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని కోరారు.​ దీనిపై విచారణ జరిపిన సీజేఐ డీవీ చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌లు సంజీవ్‌ఖన్నా, ఎంఎం సుందరేష్‌, బేల ఎం త్రివేదిలతో కూడిన ప్రత్యేక త్రిసభ ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.

కాగా హేమంత్ సోరెన్ మొదట జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు.  గురువారం ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే సోరెన్‌ తరపు సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, హైకోర్టు నుంచి పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఈ ఇద్దరు న్యాయవాదులు గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరై తమ పిటిషన్‌పై అత్యవసర జాబితా కింద విచారించాలని పేర్కొన్నారు. 

హేమంత్‌ సోరెన్‌ బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్‌ చేసింది. అలాగే సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

మరోవైపు జార్ఖండ్‌లో నేడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్‌ సోరెన్‌ శుక్రవారం మధ్యాహ్నం 12  నుంచి 2 గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని జేఎంఎం శాసనసబాపక్షనేత చంపయ్‌ సోరెన్‌ను గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ గురువారం రాత్రి ఆహ్వానించారు.  ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు.
చదవండి: ఎన్నికల్లో గెలవాలనే అందర్నీ జైలుకు పంపుతోంది: మమత

whatsapp channel

మరిన్ని వార్తలు