Surekha Yadav: వందేభారత్‌ రైలు నడిపిన సురేఖ యాదవ్‌.. ఏషియా తొలి మహిళా లోకోపైలట్‌ మరో కొత్త రికార్డు 

15 Mar, 2023 12:21 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడిపిన మొదటి మహిళ లోకోపైలట్‌గానూ సురేఖ యాదవ్‌ చరిత్ర సృష్టించారు. షోలాపూర్‌–ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టర్మినస్‌ (సీఎస్‌ఎంటీ) మధ్య నడుస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో లోకోపైలట్‌ (డ్రైవర్‌)గా సురేఖ యాదవ్‌ విధులు నిర్వహించారు. షోలాపూర్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం సీఎస్‌ఎంటీ దిశగా బయలుదేరిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పగ్గాలను రైల్వే అధికారులు సురేఖకు అప్పగించారు.

34 సంవత్సరాలుగా భారతీయ రైల్వేలో వివిధ సేవలందిస్తున్న సురేఖ యాదవ్‌కు గూడ్స్‌ రైళ్లు, ప్యాసింజరు రైళ్లు నడిపిన అనుభవముంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపాలన్న కల నెరవేరిందని, ఈ గౌరవం ఇచ్చినందుకు భారతీయ రైల్వేకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. షోలాపూర్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం టైంటేబుల్‌ ప్రకారం బయలుదేరిన ఈ రైలును సీఎస్‌ఎంటీకి ఐదు నిమిషాల ముందే చేర్చారు.

ఇక్కడ ఆమెకు ఘన స్వాగత లభించింది. ఖండాలా–కర్జత్‌ మధ్య ఘాట్‌ సెక్షన్‌లో రైలు నడపడమంటే లోకోపైలట్‌కు కత్తిమీద సాములాంటిదే. ముఖ్యంగా ఇతర ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల మాదిరిగా వందేభారత్‌కు ప్రత్యేకంగా ఇంజిన్‌ ఉండదు. మధ్యలో అక్కడక్కడా మూడు చోట్ల పెంటాగ్రాఫ్‌తో కనెక్టివిటీ అయ్యే విద్యుత్‌ మోటార్లుంటాయి. అయినప్పటికీ ఎంతో చాకచక్యంగా రైలును నడిపిన సురేఖ.. ఐదు నిమిషాల ముందే గమ్యస్థానానికి చేర్చారు.  

1996 నుంచి.. 
మహారాష్ట్ర సాతారా జిల్లాలోని సెయింట్‌ పాల్‌ స్కూల్‌లో చదువుకున్న సురేఖ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేశారు. 1989లో అసిస్టెంట్‌ లోకోపైలట్‌గా నియమితులయ్యారు. శిక్షణ పూర్తిచేసుకుని 1996లో గూడ్స్‌ రైలు డ్రైవర్‌గా విధినిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 2000లో మోటార్‌ ఉమెన్‌గా గౌరవం పొందారు. 2010లో ఘాట్‌ సెక్షన్‌లో రైలు నడపడంలో శిక్షణ పొందారు. ఆ తరువాత పుణే–ముంబై నగరాల మధ్య నడుస్తున్న డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు లోకోపైలట్‌గా ఎలాంటి రిమార్కు లేకుండా విధులు నిర్వహించారు. ఇప్పుడు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపడంలో కూడా సఫలీకృతం కావడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.    

మరిన్ని వార్తలు