నా భార్యపై దారుణంగా దాడి చేశారు.. ఆర్మీజవాన్‌ వీడియో కలకలం

11 Jun, 2023 15:02 IST|Sakshi

కొంతమంది వ్యక్తులు నా భార్యపై దారుణంగా దాడి చేశారంటూ ఓ ఆర్మీ జవాన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో కడవాసల్‌ గ్రామంలో కొందరు వ్యక్తులు నా భార్యను అర్థనగ్నంగా చేసి దాడి చేశారంటూ ఆమె భర్త ఆర్మీ జవాన్‌ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోని రిటైర్డ్‌ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎన్‌ త్యాగరాజన్‌ పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో.. ఆరోపణలు చేస్తున్న ఆర్మీ జవాన్‌ హవల్దార్‌ ప్రభాకరన్‌ తమిళనాడులోని పడవేడు గ్రామానికి చెందిన వ్యక్తి.

అతను ప్రస్తుతం కాశ్మీర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో అతను తన భార్యకు జరిగిన అవమానం గురించి వివరించాడు. తన భార్య ఒక స్థలంలో లీజుకు ఓ దుకాణం నుడుపుతోందని వీడియోలో తెలిపాడు. ఆమెను 120 మంది వ్యక్తలు కొట్టి షాపులోని వస్తువులను బయటకు విసిరేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కత్తులతో నా కుటుంబంపై దాడి చేసి బెదిరించారని, తన భార్యను అర్ధ నగ్నం చేసి దారుణంగా కొట్టారని ఆరోపణలు చేశాడు. అయితే పోలీసులు అతని ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కంధవాసల్‌ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆ ప్రకటనలో..రేణుగాంబాల్‌ ఆలయానికి చెందిన స్థలంలో నిర్మించిన దుకాణాన్ని ప్రభాకరన్‌ మామగారైన సెల్వమూర్తి కుమార్‌ నుంచి ఐదేళ్ల కాలానికి రూ. 9.5 లక్షలకు లీజుకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుమార్‌ మరణించిన తర్వాత అతని కుమారుడు రాము దుకాణాన్ని తిరిగి ఇవ్వాలని కోరాడు. అందుకు డబ్బు తిరిగి ఇవ్వడాన్ని కూడా అంగీకరించడమే గాక ఒప్పందంపై సంతకం కూడా చేశాడు. ఐతే సెల్వమూర్తి డబ్బు తీసుకునేందుకు తిరస్కరించడమే గాక దుకాణం నుంచి వెళ్లేందుకు నిరాకరించాడని రాము పేర్కొన్నాడు. ఈ క్రమంలో జూన్‌ 10వ తేదిన సెల్వమూర్తి కుమారులు జీవా, ఉదయలకు డబ్బు ఇచ్చేందుకు రాము దుకాణానికి వెళ్లగా అతనిపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం.

ఈ గొడవను గమనించి స్థానికులు రాముకు పెద్ద ఎత్తున మద్దతుగా రావడంతో అది కాస్త పెద్దదై, అక్కడ దుకాణంలో వస్తువులు బయటకు విసిరేసేంత వరకు దారితీసిందని  పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో దుకాణంలో ప్రభాకరన్‌ భార్య కీర్తి, ఆమె తల్లి దుకాణంలో ఉన్నారని, కానీ వారిపై ఆ గుంపు దాడి చేయలేదని ప్రకటనలో వెల్లడించారు పోలీసులు.

ఇదిలా ఉండగా, తమిళనాడు బీజేపీ చీఫ్‌ కే అన్నామలై ఆర్మీ జవాన్‌తో మాట్లాడి తమ పార్టీ అతని భార్యకు న్యాయం చేయడమే గాక కుటుంబానికి అండగా ఉంటామని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ చీఫ్‌ ఆ ట్వీట్‌లో..కాశ్మీర్‌లో మన దేశానికి ధైర్యంగా సేవ చేస్తున్న హవల్దార్‌, అతని భార్యతో ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. ఆమె కథ విని నిజంగా బాధనిపించింది. తమిళ గడ్డపై ఆమెకు ఇలా జరిగినందుకు సిగ్గుపడ్డాను. వెల్లూరులో ఓ ఆస్పత్రిలో చేరినా ఆమెను తమ పార్టీ పరామర్శించినట్లు ట్వీట్‌ చేశారు. 

(చదవండి: కేకు డబ్బులు అడిగాడని కాల్పులు.. దుకాణదారుని మృతి!)

మరిన్ని వార్తలు