వీడియో: ఎస్సైకు వార్నింగ్‌.. అక్బరుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు

22 Nov, 2023 15:34 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని దూషించారనే అభియోగాలను అక్బరుద్దీన్‌పై బుధవారం కేసు నమోదు చేశారు సంతోష్‌ నగర్‌ పోలీసులు. ఈ మేరకు ఓ వీడియో వైరల్‌ కావడం కూడా తెలిసిందే.  

ల‌లితాబాగ్‌లో మంగళవారం రాత్రి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మయంలో.. సమయం అయిపోతుందని, ప్ర‌చారం ముగించాల‌ని స్థానికంగా విధులు నిర్వ‌స్తున్న ఎస్సై శివచంద్ర అక్బరుద్దీన్‌ను కోరారు. ఆ స‌మ‌యంలో పోలీసు అధికారిపై అక్బ‌రుద్దీన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంకా సమయం ఉందని, తాను మాట్లాడి తీరతానని, తనను ఆపేవాళ్లింకా పుట్టలేదని, తనను ఆపే దమ్ము ఎవరికీ లేదని, తన ఒంట్లో బుల్లెట్లు దిగినా.. కత్తిగాయాలు అయినా ధైర్యం ఇంకా మిగిలే ఉందని, ఒక్క సైగ చేస్తే ఇక్కడ ఉన్న అందరూ నిన్ను పరిగెత్తిస్తారంటూ ఎస్సైను ఉద్దేశించి అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో పాటు రాజకీయంగానూ విమర్శలకు తావిచ్చింది. మరోవైపు ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్‌ 353(విధుల్ని అడ్డుకోవ‌డం)తో పాటు మరికొన్ని సెక్ష‌న్ల కింద అక్బరుద్దీన్‌ ఒవైసీపై కేసు న‌మోదు చేసిన‌ట్లు డీసీపీ రోహిత్ రాజు వెల్లడించారు.

బీజేపీ స్పందన..
దశాబ్దాలుగా, కాంగ్రెస్ & బీఆర్ఎస్ మద్దతుతో, ఎంఐఎం ఒక నేర సంస్థగా మారిందని, ఇది పాత నగరాన్ని నిర్వీర్యం చేసిందని తెలిపింది. అలాగే నేరాల బారిన పడకుండా చేసిందని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన ఈ గజిబిజిని శుభ్రం చేయడానికి ఇది సమయం అని తెలిపింది. బిజెపి ప్రభుత్వంలో, అక్బరుద్దీన్ చర్యకు బుల్డోజర్ ప్రతిచర్య ఉంటుందని బీజేపీ తెలంగాణ ట్వీట్ చేసింది.

మరిన్ని వార్తలు