Corona Deaths in India: 2 లక్షలు దాటిన మరణాలు

29 Apr, 2021 05:22 IST|Sakshi

ఒక్కరోజులో 3,293 మంది మృతి

గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3,60,960 పాజిటివ్‌ కేసులు 

దేశంలో 30 లక్షలకు చేరువలో యాక్టివ్‌ కేసులు

సాక్షి, న్యూఢిల్లీ: అవే భయాందోళనలు... అవే హాహాకారాలు.... అవే హృదయ విదారక దృశ్యాలు. గత కొన్నిరోజులుగా కరోనా కేసులు భారీగా పెరగడంతో ఏర్పడ్డ ఆక్సిజన్, ఆసుపత్రి పడకల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినప్పటికీ పరిస్థితిలో మార్పు ఏమాత్రం కనిపించట్లేదు. గత 7 రోజులుగా దేశంలో రోజుకి 3 లక్షలకు పైనే కొత్తకేసులు వస్తున్న నేపథ్యంలో భారత్‌ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

ఈనెల 21న తొలిసారిగా పాజిటివ్‌ కేసుల్లో 3 లక్షల మార్క్‌ దాటిన భారత్‌లో గత ఏడు రోజుల్లో మొత్తం 23,80,746 కరోనా సంక్రమణ కేసులు, 18,634 మరణాలు నమోదు అయ్యాయి. కాగా గతేడాది నుంచి కరోనా విలయంలో చిక్కుకొని విలవిల్లాడుతున్న అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

గత వారం గణాంకాల ప్రకారం భారత్‌ తరువాత స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో 3,98,487 పాజిటివ్‌ కేసులు, 17,019 మరణాలు రికార్డ్‌ అయ్యాయి. ఆ తరువాత అమెరికాలో 3,76,618 పాజిటివ్‌ కేసులు, 4,874 మరణాలు సంభవించాయంటే మనదేశంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 41.4% కేసులు భారత్‌లోనే నమోదవ్వడం కరోనా వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది.

10 రాష్ట్రాల నుంచే 73.59 శాతం కేసులు
బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా 3,60,960 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. దీంతో  దేశంలో కరోనా సోకిన రోగుల సంఖ్య 1,79,86,840కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా కేసులలో 73.59% శాతం కేసులు ఎక్కువగా ప్రభావితమైన పది రాష్ట్రాల నుంచి వచ్చాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 66,358, ఉత్తర్‌ప్రదేశ్‌లో 32,921, కేరళలో 32,819, కర్ణాటకలో 29,744 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్యలోనూ పెరుగుదల కొనసాగుతోంది. గత 24 గంటల్లో మరణించిన 3,293మందితో కలిపి కరోనా కారణంగా మరణించిన మొత్తం రోగుల సంఖ్య 2,01,172 కు పెరిగింది.

కరోనా గణాంకాల్లో కొత్త కేసులు, మరణాలు ఇవే అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు ప్రస్తుతం దేశంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 29,78,709కు పెరిగింది. దీంతో దేశంలో యాక్టివ్‌ రోగుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. అదే సమయంలో 2,61,162 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,48,17,371 మందికి ఈ వ్యాధి నయమైంది.  గత ఏడు రోజులుగా ప్రతీరోజు 3 లక్షలకు మించి కొత్త కేసులు నమోదు కావడంతో రికవరీ రేటు 82.54 శాతానికి, మరణాల రేటు 1.12 శాతానికి పడిపోయింది. మంగళవారం 17,23,912 శాంపిల్స్‌ పరీక్షించగా 3,60,960 మందికి పాజిటివ్‌గా తేలింది. అంటే 20.9 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. అంటే పరీక్షించిన ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా సోకింది.

మరిన్ని వార్తలు