'అద్దాల మేడల్లో నివసించేవాళ్లు ఎదుటివాళ్లపై రాళ్లు విసరకూడదు'

12 Jun, 2021 03:35 IST|Sakshi

పరమ్‌బీర్‌ కేసులో సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ‘‘అద్దాల మేడల్లో నివసించేవాళ్లు ఎదుటివాళ్లపై రాళ్లు విసరకూడదు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముంబై పోలీస్‌ మాజీ కమిషనర్‌ పరబ్‌ బీర్‌ సింగ్‌ కేసుపై విచారణ జరిపిన కోర్టు, 30 సంవత్సరాలు సర్వీసులో ఉన్న వ్యక్తి ప్రస్తుతం రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదనడం విస్మయాన్ని కలిగిస్తోందని పేర్కొంది. తనపై మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన ఎంక్వైరీలన్నింటినీ మహారాష్ట్ర వెలుపల స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని పరమ్‌బీర్‌ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. తాను పనిచేసిన శాఖపై అపనమ్మకం కూడదని సింగ్‌కు హితవు పలికింది.

ఈ సందర్భంగా పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేయగా, తన క్లయింట్‌పై తప్పుడు కేసులు పెట్టి ఎంక్వైరీలు నిర్వహిస్తున్నారని సింగ్‌ న్యాయవాది వాదించారు. చివరకు ఈ పిటీషన్‌ను డిస్మిస్‌ చేయాలని కోర్టు భావించగా, పిటీషన్‌ ఉపసంహరణకు అనుమతినివ్వాలని న్యాయవాది కోరగా, కోర్టు అనుమతించింది. ఎన్‌సీపీ నేత అనీల్‌ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలతో సింగ్‌ వార్తల్లో నిలిచారు. అనంతరం ఆయన్ను మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై కమిషనర్‌ పదవి నుంచి తొలగించింది. అనంతరం ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వాదనల సందర్భంగా తన క్లయింట్‌కు రాష్ట్ర పోలీసులపై అనుమానం లేదని, కానీ ఒకదాని వెంట మరో కేసు వచ్చిపడుతోందని సింగ్‌ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దేశ్‌ముఖ్‌పై ఆరోపణల వల్లే తన క్లయిట్‌ను వేధిస్తున్నారన్నారు. కోర్టుకు చెప్పకుండా సింగ్‌పై కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా చూడాలని కోరారు. కానీ ఇది తమ పని కాదని కోర్టు వ్యాఖ్యానించింది. అనీల్‌పై ఆరోపణలు వెనక్కు తీసుకోవాలని సింగ్‌ను వేధిస్తున్నారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కానీ ఇవి రెండూ వేర్వేరు అంశాలని కోర్టు తెలిపింది. ఇదే అంశంపై సింగ్‌ బొంబై హైకోర్టులో మూడు పిటీషన్లు వేశారని, తిరిగి ఇక్కడ ఈ పిటీషన్‌ అవసరమేంటని కోర్టు ప్రశ్నించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.    

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు