కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం

3 Oct, 2023 05:22 IST|Sakshi

బీజేపీ కూటమికి 307 లోక్‌సభ స్థానాలు  

విపక్ష ఇండియా కూటమికి 175 సీట్లు  

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీకి 24–25 స్థానాలు 

తెలంగాణలో 9 నుంచి 11 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు 

జాతీయ మీడియా సంస్థ ‘టైమ్స్‌ నౌ’ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికార ఎన్డీయే మరోసారి ఘన విజయం సాధిస్తుందని జాతీయ వార్తా సంస్థ ‘టైమ్స్‌ నౌ’ తాజా సర్వేలో వెల్లడయ్యింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏకంగా 307 స్థానాలు గెలుచుకుంటుందని తెలియజేసింది. మెజార్టీ మార్కును సులువుగా అధిగమించి, కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చిచెప్పింది.

కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని విపక్ష ‘ఇండియా’ కూటమి 175 స్థానాలకే పరిమితం అవుతుందని వివరించింది. ఇతరులు 61 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక 25 లోక్‌సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని టైమ్స్‌ నౌ సర్వే ఉద్ఘాటించింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో అరెస్టయిన తర్వాత ఈ సర్వే జరిగింది.

సర్వే ఫలితాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ 24 నుంచి 25 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుంది. గత ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ ఈసారి దాదాపు మొత్తం సీట్లను కైవసం చేసుకుంటుంది. అంతేకాదు 51.10 శాతం ఓట్లు దక్కించుకుంటుంది. ప్రతిపక్ష టీడీపీకి ఒక స్థానం లభించే అవకాశం ఉంది. ఆ పారీ్టకి 36.40 శాతం ఓట్లు లభిస్తాయి. జనసేన పార్టీ కనీసం ఒక్క స్థానంలోనూ గెలిచే పరిస్థితి లేదు. కేవలం 10.10 శాతం ఓట్లు సాధించనుంది. బీజేపీకి కనాకష్టంగా 1.30 శాతం ఓట్లు పడతాయని అంచనా. ఇతరులు 1.10 శాతం ఓట్లు సాధించనున్నారు.  

మరిన్ని వార్తలు