గ్యాస్‌ ‘బండ’ భారం.. మరో రూ.25 పెంపు

25 Feb, 2021 10:47 IST|Sakshi

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను 25రూపాయలు పెంపు

ఒక్క నెలలోనే రూ.100 మేర పెరిగిన గ్యాస్‌ ధర

హైదరాబాద్‌లో ప్రస్తుత ధర రూ. 846.50

సాక్షి, హైదరాబాద్‌: ఒక పక్క పెట్రోల్, డీజిల్‌ ధరలు రాకెట్‌ వేగంతో దూసుకెళుతుంటే, మరో పక్క గృహావసర గ్యాస్‌ సిలిండర్‌ ధర కూడా వాటితో పోటీ పడుతోంది. ఈ నెలలోనే సిలిండర్‌పై రూ.75 మేర పెంచిన ఆయిల్‌ కంపెనీలు గురువారం మళ్లీ మరో రూ.25 మేర పెంచేశాయి. దీంతో హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.846.50కి చేరింది. ఒక్క నెలలోనే సిలిండర్‌ ధర ఏకంగా రూ.100 మేర పెరిగిపోవడంతో సామాన్యుడికి చుక్కలు కనపడుతున్నాయి. 

3 నెలల వ్యవధిలో రూ. 200 పెంపు
నవంబర్‌లో సిలిండర్‌ ధర రూ.646.50 ఉండగా, డిసెంబర్‌లో ఏకంగా రూ.100 మేర పెరిగిపోయింది. దీంతో ధర రూ.746.50కి చేరింది. జన వరిలో ఈ ధరలు స్థిరంగా కొనసాగినా, ఫిబ్రవరి 4న రూ.25, 15న మరోసారి రూ.50 చొప్పున ఆయిల్‌ కంపెనీలు బాదేశాయి. దీంతో సిలిండర్‌ ధర రూ.821.50కి చేరింది. తాజాగా మళ్లీ రూ.25 పెంచడంతో అదికాస్తా రూ.846.50 అయ్యింది. ఇలా ఈ మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.200 మేర పెరిగిపోయిం దన్నమాట.

రాష్ట్రంలో ప్రస్తుతం 1.18 కోట్ల గృహా వసర సిలిండర్లు వినియోగంలో ఉండగా ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. ఈ సిలిండర్‌పై ఇవ్వాల్సిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం క్రమంగా కోత పెడుతూ వస్తోంది. గత ఏడాది మార్చి ముందు వరకు ఒక్కో సిలిండర్‌పై రూ.220 వరకు సబ్సిడీ జమ చేసిన కేంద్రం.. ప్రస్తుతం కేవలం రూ.40 మాత్రమే జమ చేస్తోంది. అంటే వినియోగదారుడిపై సబ్సిడీ కోత భారం ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌కు రూ.180 పడుతోందన్నమాట. దీనికి ఈ మూడు నెలల్లో పెరిగిన ధరల భారం రూ.200 కలిపితే మొత్తం రూ.380 మేర గ్యాస్‌ భారం పడినట్లయింది. ఓ పక్క సబ్సిడీలో కోతలు, మరోపక్క ధర పెంపు వాతలతో గృహ వినియోగదారులు లబోదిబోమంటున్నారు.   

>
మరిన్ని వార్తలు