Shehla Rashid: ‘కశ్మీర్‌ గాజా కాదు.. ఆ ఘనతంతా ప్రధాని మోదీదే’ 

15 Nov, 2023 19:16 IST|Sakshi

కశ్మీర్‌ గాజా కాదని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకురాలు షీహ్లా రషిద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ గతంలో కశ్మీర్‌లో రాళ్లు రువ్విన ఉద్యమకారులకు మద్దతుగా నిలిచిన ఆమె ఇప్పుడిలా కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంపై అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు.

‘అవును అది 2010లో. అప్పుడు ఉద్యమకారులకు మద్దతివ్వడం వాస్తవమే. కానీ ఈ రోజు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. కశ్మీర్ గాజా కాదని స్పష్టమైంది’ అని షీహ్లా రషిద్‌ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లో వచ్చిన మార్పులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విధానాలే కారణమని ప్రశంసించారు. రక్తపాతాలు లేకుండా అక్కడి ఉద్రిక్తతలకు వారు రాజకీయ పరిష్కారాన్ని చూపించారని పేర్కొన్నారు.

జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితిని రషీద్ ప్రశంసించడం ఇది మొదటిసారి కాదు. 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని తీవ్రంగా విమర్శించిన రషీద్.. ఆ తర్వాత మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కశ్మీర్‌లో మానవ హక్కుల పరిస్థితిని మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ కృషి చేశారంటూ అభినందించారు.

మరిన్ని వార్తలు