పార్టీల కొట్లాట: 85 ఏళ్ల వృద్ధురాలిపై దాడి

1 Mar, 2021 14:57 IST|Sakshi
టీఎంసీ కార్యకర్తల దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్త గోపాల్‌ మజుందార్‌ తల్లి

బెంగాల్‌లో వేడెక్కుతున్న రాజకీయాలు

బీజేపీ కార్యకర్తతో పాటు అతడి తల్లి మీద దాడి చేసిన టీఎంసీ లీడర్లు

టీఎంసీ నాయకుల చర్యలపై మండిపడుతోన్న నెటిజన్లు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కాయి. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఎంసీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఉద్రిక్తంగా ఉంది పరిస్థితి. రెండు పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటుండగా.. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీఎంసీ కార్యకర్తలు కొందరు బీజేపీ కార్యకర్తతో పాటు అతడి తల్లి 85 ఏళ్ల వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఈ ఘటన బెంగాల్‌ 24 పరగణాస్‌ జిల్లా నిమ్తాలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. టీఎంసీ కార్యకర్తలు కొందరు బీజేపీ పార్టీ మద్దతుదారు అయిన గోపాల్‌ మజుందార్‌ ఇంట్లో ప్రవేశించి అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలో గోపాల్‌ తల్లి. 85 ఏళ్ల వృద్ధురాలు దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాంతో టీఎంసీ కార్యకర్తలు వృద్ధురాలు అని కూడా చూడకుండా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ సందర్భంగా వృద్ధురాలు మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు బీజేపీ కోసం పని చేస్తున్నాడనే కోపంతో టీఎంసీ గుండాలు తనపై దాడి చేశారు. నా కుమారుడిని కొట్టడంతో నేను తట్టుకోలేకపోయాను. శరీరం సహకరించకపోయినప్పటికి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాను. కానీ వారు నాపై కూడా దాడి చేశారు. వృద్ధురాలిని అని కూడా చూడకుండా నన్ను కొట్టారు. ప్రస్తుతం నేను ఏం మాట్లాడలేకపోతున్నాను.. సరిగా కూర్చోలేకపోతున్నాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

గోపాల్‌ మజుందార్‌ మాట్లాడుతూ.. ‘‘టీఎంసీ గుండాలు శనివారం అర్థరాత్రి 01.20 గంటల​ ప్రాంతంలో నా ఇంట్లోకి ప్రవేశించారు. నా తలకు గన్‌ గురిపెట్టారు. కిందపడేసి లాఠీలతో కొట్టడం ప్రారంభించారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మా అమ్మపై కూడా దాడి చేశారు. కానీ టీఎంసీ గుండాలు నన్ను ఎంత బెదిరించినా నేను భయపడను. నా ఒంట్లో చివరి రక్తం బొట్టు ఉన్నంతవరకు నేను బీజేపీ కోసమే పని చేస్తాను’’ అని తెలిపారు. 

గోపాల్‌ మజుందర్‌, అతడి తల్లి మాట్లాడిన వీడియోను బీజేపీ తన ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. టీఎంసీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘‘టీఎంసీ రోజు రోజుకు దిగజారిపోతుంది. ఈ వృద్ధురాలిపై దాడి చేశారనే వార్త నన్ను కలచి వేసింది. ఈ తల్లి ఆవేదన, బాధకు టీఎంసీ సమాధానం చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌ జనాలు బీజేపీని గెలిపించి.. టీఎంసీ రాక్షస పాలన నుంచి విముక్తి పొందుతారు’’ అంటూ ట్వీట్‌ చేశారు. టీఎంసీ కార్యకర్తల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. పాపం ఆ వృద్ధురాలు ఏం నేరం చేసిందని ఆమెపై ఇంత దారుణంగా దాడి చేశారని మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు