Rajasthan: ఆ రాష్ట్రంలోనూ హిజాబ్‌ చిచ్చు?

30 Jan, 2024 10:46 IST|Sakshi

విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై రాజస్థాన్‌లోనూ వివాదం మొదలైంది. రాష్ట్రంలోని భజన్‌లాల్ సర్కారు కూడా హిజాబ్ నిషేధానికి సంబంధించి సన్నాహాలు మొదలుపెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా ఇటీవల హిజాబ్, బురఖాపై నిషేధం విధించాలని వ్యాఖ్యానించారు. అనేక ముస్లిం దేశాలలోనే హిజాబ్‌ను నిషేధించినప్పుడు ఇక్కడ హిజాబ్ ఇంకా ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు. 

ఈ నేపధ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో హిజాబ్ నిషేధానికి సంబంధించిన స్థితిగతులు, రాజస్థాన్‌లో దాని ప్రభావాలకు సంబంధించిన వివరాలపై ఒక నివేదికను రూపొందించి, దానిని రాష్ట్ర విద్యా మంత్రి మదన్ దిలావర్‌కు విద్యాశాఖాధికారులు పంపినట్లు సమాచారం. రాజస్థాన్‌ బీజేపీ ఎమ్మెల్యే బాల ముకుందాచార్య హిజాబ్‌కు సంబంధించిన ప్రశ్నను తొలుత లేవనెత్తారు. గణతంత్ర దినోత్సవం రోజున వివిధ పాఠశాలలను సందర్శించిన ఆయన పాఠశాలలో రెండు రకాల డ్రెస్‌ కోడ్‌లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. పాఠశాలల్లో డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పలువురు విద్యార్థినులు నిరసనకు దిగారు. 

ఇదిలావుండగా రాష్ట్రంలో హిజాబ్‌ను నిషేధించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా పేర్కొన్నారు. స్కూళ్లలో డ్రెస్ కోడ్ ఉంటుందని, హిజాబ్ ధరించి రావడాన్ని ఆయన తప్పుబట్టారు. ముస్లిం సమాజంలో మత ఛాందసవాదం ఉందని, కాంగ్రెస్ దానికి వత్తాసు పలుకుతున్నందున తాము  హిజాబ్‌ నిషేధం దిశగా ముందుకు సాగలేకపోతున్నామని అన్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు