‘అతను జైలుకు పోవాల్సిందే!’ రెజ్లర్ల మీటూ ఉద్యమంపై కొనసాగుతున్న ఉత్కంఠ

19 Jan, 2023 21:29 IST|Sakshi

న్యూఢిల్లీ: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌పై మీటూ ఆరోపణల దరిమిలా.. ఆయన్ని  గద్దె దించడమే ధ్యేయంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. గురువారం సాయంత్రం ఫెడరేషన్‌ అధికారులతో, ప్రభుత్వ ప్రతినిధులతో క్రీడామంత్రిత్వ శాఖ కార్యాయలంలో చర్చలు జరిగినప్పటికీ.. అవి విఫలం అయినట్లు స్పష్టమవుతోంది. 

చర్చలు సంతృప్తికరంగా సాగలేదని, స్పష్టమైన హామీలు లభించలేదని, అలాగే.. ఫెడరేషన్‌ చీఫ్‌ను తొలగించడంపైనా ప్రభుత్వం తరపున ఎలాంటి హామీ రాలేదని రెజ్లర్లు మీడియాకు వెల్లడించారు. మా దగ్గర ఐదుగురి నుంచి ఆరుగురు అమ్మాయిలు ఇప్పటికిప్పుడు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అతను(బ్రిజ్‌ భూషణ్‌) జైలుకు వెళ్లాల్సిందే. మా డిమాండ్లు నెరవేరేంత వరకు రెజ్లింగ్‌ బరిలోకి దిగేది లేదు. ఒకవేళ ప్రభుత్వం గనుక స్పందించకుంటే.. పోలీసుల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందని  రెజర్లు వినేశ్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌లు, ఈ నిరసనలకు నేతృత్వం వహించిన బజరంగ్‌ పూనియాలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. చర్చలు విఫలమైన నేపథ్యంలో రాత్రి పది గంటల సంమయంలో నేరుగా క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ థాకూర్‌తో రెజ్లర్లు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక జంతర్‌ మంతర్‌ వద్ద గురువారం నాడు(రెండోరోజు) కొనసాగిన ధర్నాలో 200 మంది రెజ్లర్లు పాల్గొన్నారు. ప్రధాని మోదీపై ఉన్న నమ్మకంతోనే తాము న్యాయపరమైన చర్యలకు దిగట్లేదని వాళ్లు ప్రకటించారు. అయితే.. బీజేపీ ఎంపీ, ఒలింపియన్‌ అయిన బబితా ఫోగట్‌ దౌత్యంతో ప్రభుత్వంతో చర్చలకు ముందుకు వచ్చారు రెజ్లర్లు.  మరోవైపు కేంద్ర క్రీడా శాఖ బుధవారం ఈ ఆరోపణలపై 72 గంటల్లో స్పందించాలని డబ్ల్యూఎఫ్‌ఐకి అల్టిమేటం జారీ చేసింది కూడా. ఇదిలా ఉంటే.. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌(66) .. తొలి నాళ్లలో రెజ్లరు కూడా. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన.. నిజమని తేలితే ఆత్మహత్య చేసుకుంటానంటూ అంటున్నారు.

వినేశ్‌ ఫోగట్‌(28) ఆరోపణలతో ఈ వ్యవహారంపై తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తనకు ఆ పరిస్థితి ఎదురు కాకున్నా.. నేషనల్‌ క్యాంప్‌లో ఉన్న సుమారు 20 మందికి అలాంటి వేధింపులు ఎదురు అవుతున్నాయని, కోచ్‌లతో పాటు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ కూడా ఈ వేధింపుల పర్వంలో భాగం అయ్యారంటూ ఫోగట్‌ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వాళ్ల కుటుంబ నేపథ్యాల దృష్ట్యా భయంతో ముందుకు రావడం లేదని, అందుకే తాను పోరాటానికి ముందుకు వచ్చి న్యాయం కోరుతున్నానని వెల్లడించారామె. ఆమెకు మద్దతుగా పలువురు రెజ్లర్లు జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు తోడయ్యారు. మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్‌ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. అదే సమయంలో క్రీడా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. 

నేషనల్‌ సైక్లింగ్‌ టీం కోచ్‌ను లైంగిక ఆరోపణలతో తొలగించి నెలలు గడవకముందే.. రెజ్లింగ్‌లో ఇలాంటి ఆరోపణలు రావడంతో క్రీడా రంగం దిగ్భ్రాంతికి లోనవుతోంది. 

హాలీవుడ్‌ నుంచి మొదలైన మీటూ ఉద్యమం.. ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించింది. భారత్‌లో 2018లో కొందరు నటీమణులు.. తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి మన దేశంలోనూ తరచూ మీటూ ఘటనలు తెరపైకి వస్తున్నాయి.

మరిన్ని వార్తలు