పైరసీకి అడ్డుకట్ట వేస్తాం

4 Nov, 2023 03:09 IST|Sakshi

 కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

‘‘పైరసీ కారణంగా ప్రతి ఏడాది వినోద రంగానికి రూ.20 వేల కోట్లు నష్టం వాటిల్లుతోంది. ఓ సినిమా నిర్మాణానికి పడ్డ కష్టం పైరసీ వల్ల వృథాగా పోతోంది. పైరసీని అడ్డుకోవడానికి కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖలో నోడల్‌ ఆఫీసర్స్‌ను నియమించడం జరిగింది’’ అని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు.

ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టం–1952లో సవరణలు చేసి, కొత్త బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో పైరసీని అరకట్టడం అనేది ఓ ప్రధానాంశం. ఈ విషయమై శుక్రవారం అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ– ‘‘ ముంబైలోని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ కార్యాలయంలో,ప్రాంతీయ కార్యాలయాల్లో పైరసీ, డిజిటల్‌ పైరసీల ఫిర్యాదులను స్వీకరించేందుకు అధికారులను నియమించాం.

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న పైరేటెడ్‌ కంటెంట్‌పై నోడల్‌ ఆఫీసర్స్‌కు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు 48 గంటల్లో ఆ కంటెంట్‌ను ఆ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి తొలగించేలా చర్యలు చేపడతారు’’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు