మహిళా సాధికారతపై నాట్స్ వెబినార్

24 Nov, 2021 13:18 IST|Sakshi

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర  అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మహిళా సాధికారతపై దృష్టి సారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ ద్వారా వెబినార్స్ నిర్వహించి మహిళా సాధికారత కోసం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా జరిగిన తొలి వెబినార్‌కు చక్కటి స్పందన లభించింది. చాలా మంది మహిళలు ఫేస్ బుక్, జూమ్ యాప్స్ ద్వారా ఈ వెబినార్‌ను వీక్షించి విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు. మహిళ  సమస్యల పరిష్కారంపై అవగాహన పెంచుకున్నారు. 
మానవితో కలిసి
మహిళల హక్కులు, వారి సమస్యలకు పరిష్కారాలపై పనిచేస్తున్న మానవితో కలిసి నాట్స్ మహిళా సాధికారత కోసం తన వంతు కృషి చేస్తోంది.. దీనిలో భాగంగానే నిర్వహించిన తొలి ఆన్ లైన్ వెబినార్‌లో ప్రముఖ న్యాయవాది, పరివర్తన హోమ్ కో ఆర్డినేటర్ పూనమ్ సక్సేనా పాల్గొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులకు ఎలా చెక్ పెట్టాలి, మహిళలు తరచూ గృహహింస తదితర సమస్యలకు పరిష్కారాలు ఏమిటి..? అనే అంశాలపై పూనమ్ సక్సేనా చక్కటి అవగాహన కల్పించారు. దీంతోపాటు లాక్ డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్‌ సమయంలో భర్తలు భార్యలను వేధించిన ఘటనలు ఎక్కువగా జరిగాయని ఆమె తెలిపారు. ఇలాంటి గృహ హింస కేసుల్లో బాధిత మహిళలకు అండగా నిలిచేందుకు తమ వంతు సాయం చేస్తామని పూనమ్ అన్నారు.


నాట్స్‌ చేసిన సాయం
ఈ వెబినార్‌లో నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా సాయం పొందిన బాధిత మహిళ తన అనుభవాలను పంచుకున్నారు.. అత్తింటి వేధింపులతో నరకప్రాయమైన జీవితం నుంచి బయటపడి తాను స్వశక్తితో నిలబడేలా చేయడంలో తనకు నాట్స్ చేసిన సాయం  మరువలేనిదంటూ  బాధిత మహిళ తెలిపారు. 
ధన్యవాదాలు
భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి లక్ష్మీ బొజ్జ వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వనం జ్యోతి ధన్యవాదాలు తెలిపారు. పద్మజ నన్నపనేని, ఆశా వైకుంఠం, బిందు యలమంచిలి ఈ కార్యక్రమం విజయవంతానికి తమ వంతు సహకారాన్ని అందించారు.  ఈ వెబినార్‌కి వ్యాఖ్యతగా గీతా గొల్లపూడి వ్యవహరించారు. 
 

మరిన్ని వార్తలు