YSR Jayanthi Celebrations 2022: అమ్మ, నాన్నల తర్వాత వైఎస్సారే నాకు స్ఫూర్తి: పంచ్‌ ప్రభాకర్‌

6 Jul, 2022 11:18 IST|Sakshi

జీవితంలో నేను ఏది చేసినా తల్లిదండ్రుల తర్వాత వైఎస్సార్‌ స్ఫూర్తితోనే అని ఎన్‌ఆర్‌ఐ ప్రభాకర్‌రెడ్డి (పంచ్‌ ప్రభాకర్‌) అన్నారు. యూఎస్‌ఏలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. 'ప్రేమకు మూడు అక్షరాలు ఉన్నాయనుకుంటే అది వైఎస్సారే.

ఆయన ప్రతి అడుగులో మానవత్వం, దాతృత్వం, సమానత్వం కనిపిస్తాయి. వైఎస్సార్‌ ఒక గొప్ప మానవతావాది. శత్రువును కూడా అక్కున చేర్చుకున్న వ్యక్తి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెడితే.. సీఎం జగన్‌ వాటిని కొనసాగిస్తూ, నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపు రేఖలను మారుస్తున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ స్ఫూర్తి, బెండపూడి పాఠశాల ఉపాధ్యాయుడు చేసే కార్యక్రమాలు‌, పడుతున్న కష్టం చూసి ఆ స్కూల్‌ను దత్తత తీసుకోవడం జరిగింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నాతో పాటు, ఇక్కడి అనేక మంది మిత్రులు ముందుకొచ్చారు. ఇప్పటిదాకా పేద విద్యార్థులకు, రైతులకు నా వంతు మేర సహాయపడుతూ వచ్చాను. వాటన్నింటికి మహానేత వైఎస్సారే నాకు స్ఫూర్తి.

రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ప్రతిభ ఉండి.. పేదరికంతో ముందుకెళ్ల లేని స్థితిలో ఉంటారో వారిని ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తాం. అందుకోసం మేడపాటి వెంకట్‌తో కలిసి కార్యాచరణను కూడా రూపొందిస్తాం. గ్రామీణ ప్రాంత యువతకు రూరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేసి వారి భవిష్యత్‌కు తోడ్పాటునందిస్తామని' పంచ్‌ ప్రభాకర్‌ తెలిపారు.

చదవండి: (CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు