బైడెన్‌ సర్కారు తీపి కబురు.. ఆటోమెటిక్ వర్క్‌ ఆథరైజేషన్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

12 Nov, 2021 19:37 IST|Sakshi

Good News for Spouses of H-1B Visa Holders: అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలుకంటున్న భారతీయులకు బైడెన్‌ సర్కారు తీపి కబురు తెలిపింది. వలసదారులకు ప్రయోజనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఆటోమేటిక్‌ వర్క్‌ ఆథరైజేషన్‌  కింద అనుమతులు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయులతో పాటు అనేక మంది వలసదారులు ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న ఇక్కట్లు తొలగిపోయాయి. 

ఒబామా ఇచ్చారు
ఒబామా హయాంలో హెచ్‌-1బీ వీసాదారుల భార్య లేదా జీవిత భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల కోటి కలలతో అమెరికాలో అడుగు పెట్టిన వలసదారులకు ఆర్థికంగా కొంత స్వావలంభన దొరికింది. అయితే హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్‌-4 వీసాదారులు ఉద్యోగాలు పొందకుండా నిషేధం విధించారు.

సవాల్‌ చేస్తూ పిటిషన్‌
ఆటోమేటిక్‌ వర్క్‌ ఆథరైజేషన్‌ అంశంపై హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌(ఏఐఎల్‌ఏ) పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తాజాగా బైడెన్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో ఇంత కాలం హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, వారి 21 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోయాయి.

తొలగిన ఇబ్బందులు
బైడెన్‌ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ని​ర్ణయంతో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు ఇకపై తమ ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ పొడగింపు కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు. ఆటోమెటిక్‌గా పని అనుమతులు రానున్నాయి.  ఇప్పటి వరకు 90వేలకు పైగా హెచ్‌-4 వీసాలను జారీ చేయగా.. వీటిలో మెజార్టీ సంఖ్యలో భారతీయ మహిళలు ఉండటం గమనార్హం.

ఇప్పటి నష్టపోయారు
హోంల్యాండ్‌ సెక్యూరిటీ విధించిన నిషేధం కారణంగా హెచ్‌-1బీ వీసా కలిగినవారి భార్యా పిల్లలు ఉద్యోగాలు చేసుకునేందుకు  రీ-ఆథరైజేషన్‌ కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ఈలోగా ఎలాంటి చట్టబద్ధమైన కారణాలు లేకుండా అత్యధిక వేతనాలు పొందే అనేక మంది హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు ఉద్యోగాలను కోల్పోయారు. 

హెచ్‌ 4 వీసా అంటే
అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్‌-4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే, హెచ్‌-4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్‌ పత్రాల పొడగింపు కోసం తరచూ రెగ్యులేటరీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. 

చదవండి:అమెరికా వెళ్తున్నారా ? మోత మోగుతున్న విమాన ఛార్జీలు!

మరిన్ని వార్తలు