Quietest Town : గ్రహాంతరవాసులతో ఆ ఊరి వాళ్లకి సంబంధం ఏంటి? అడుగుపెట్టగానే..

9 Nov, 2023 11:29 IST|Sakshi

ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్స్‌ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకపూట భోజనం అయినా మానేస్తాం గానీ ఫోన్‌ లేకుండా ఉండలేం అనేంతగా అడిక్ట్‌ అయిపోతున్నాం. అయితే ఓ ఊళ్లో నివసించే ప్రజలు మాత్రం మొబైల్, టీవీ , రేడియో సహా ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులేవీ ఉపయోగించరు.

వినడానికి వింతగా ఉన్నా ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇదే నియమాన్ని పాటిస్తున్నారు. టెక్నాలజీకి దూరంగా ఉన్న ఆ ఊరు ఎక్కడుంది? సెల్‌ఫోన్స్‌ లేకుండా అక్కడివాళ్లు ఎలా కమ్యూనికేట్‌ చేసుకుంటారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. 

అమెరికా వెస్ట్‌‌‌‌ వర్జీనియాలోని పోకాహోంటాస్ కౌంటీలో ఉన్న గ్రీన్ బ్యాంక్ సిటీలోని ప్రజలు సాంకేతికతను ఉపయోగించరు. ఎలక్ట్రోమాగ్నెటిక్‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌పై ఇక్కడ నిషేధం ఉండటంతో ఎవరూ స్మార్ట్‌ఫోన్స్‌, వైఫై వంటివేవీ ఉపయోగించడానికి వీల్లేదు. ఈ ఊళ్లు సెల్‌ఫోన్స్‌, వాటి సిగ్నల్‌ టవర్స్‌ ఎక్కడా కనిపించవు. గత యాభై ఏళ్లుగా ఇదే నిబంధన అమల్లో ఉంది. ఈ రూల్స్‌ పాటించేవాళ్లు ఊళ్లో ఉంటారు. అందుకు తగ్గట్లుగా ముందే రెంటల్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇష్టం లేకపోతే ఊరు ఖాళీ చేయొచ్చు కానీ రూల్స్‌ మాత్రం మార్చరు.

నో సిగ్నల్స్‌.. కారణమిదే

2010 గణాంకాల ప్రకారం అక్కడి జనాభా 150 మంది కంటే తక్కువే.(ఆ తర్వాత అధికారులు డాటాను వెల్లడించలేదు) సోలార్‌‌‌‌ పవర్‌‌‌‌, పాడిపరిశ్రమే అక్కడి వారి జీవనాధారం. వారంతంలో పర్యాటకులు అక్కడికి వచ్చినా సెల్‌ఫోన్లు పనిచేయకుండా ప్రత్యేకంగా జామర్లు కూడా ఏర్పాటు చేశారు. గ్రీన్‌బ్యాంక్‌ సిటీలోని ప్రజలు టెక్నాలజీకి దూరంగా ఉండటానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద రేడియా టెలిస్కోప్‌ ఉంది. ఖగోళంలోని రహస్యాలను చేధించేందుకు సుమారు 100 మిలియన్‌‌‌‌ డాలర్ల ఖర్చుతో గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం పరిశోధనులు కొనసాగుతున్నాయి. 

ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. అందుకే రేడియా టెలిస్కోప్‌కి ఎలాంటి డ్యామేజీ కాకూడదన్న ఉద్దేశంతో ఫ్రీక్వెన్సీతో పని చేసే ఎలక్ట్రానిక్‌‌‌‌ డివైజ్‌‌‌‌లను అనుమతించరు.అందుకే సిగ్నల్ ఆధారిత ఎలక్ట్రానిక్‌‌‌‌ డివైజ్‌‌‌‌లపై ఇక్కడ నిషేధం ఉంది.మరి కమ్యూనికేషన్‌ ఎలా అంటారా?.. ఊరికి దూరంగా ప్రత్యేకంగా కొన్ని రేడియో సెంటర్లు, ఫోన్‌‌‌‌ బూత్‌‌‌‌లు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. 

మరిన్ని వార్తలు