16న కారెంపూడి వైస్‌ ఎంపీపీ ఎన్నిక

11 Nov, 2023 01:40 IST|Sakshi

కారెంపూడి: కారెంపూడి మండల ప్రజా పరిషత్‌ ఉపాధ్యక్ష పదవి కోసం ఈ నెల 16వ తేదీన ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎల్‌.శివశంకర్‌ ఎన్నిక నిర్వహణ కోసం డ్వామా పీడీ జి.జోసెఫ్‌కుమార్‌ను ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిషత్‌ సభ్యుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపీటీసీ సభ్యులకు నోటీసులు జారీ చేస్తున్నారు.

నేటి నుంచి తిరు నక్షత్ర మహోత్సవం

తాడేపల్లిరూరల్‌ : విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శనివారం నుంచి 16వ తేదీ వరకు తిరునక్షత్ర మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు తెలిపారు. ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు.

యార్డులో 19,321 బస్తాల మిర్చి విక్రయం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు శుక్రవారం 16,744 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 19,321 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,700 నుంచి రూ.22,500 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి 24,100 వరకు లభించింది. ఏసీ కామన్‌ రకం క్వింటాలుకు రూ.15,000 నుంచి రూ.21,300 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.9,000 నుంచి 23,800 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.6,000 నుంచి రూ.14,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 7,160 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

రెండు సబ్‌సెంటర్లకు

ఎన్‌క్యూఏఎస్‌ సర్టిఫికెట్లు

తాడేపల్లిరూరల్‌ : దుగ్గిరాల మండలంలోని రెండు ఆరోగ్య ఉపకేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ క్వాలిటీ ఎస్యూరెన్స్‌(ఎన్‌క్యూఏఎస్‌) సర్టిఫికెట్లు అందాయి. ఈ సందర్భంగా దుగ్గిరాల ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ అబ్దుల్‌ రహమాన్‌ సబ్‌ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రబృందం పరిశీలనలో దుగ్గిరాల మండలంలోని దుగ్గిరాల ఉపకేంద్రానికి 93 మార్కులు, మోరంపూడి ఉప కేంద్రానికి 91 మార్కులు వచ్చాయని, సాధారణంగా 75 మార్కులు వస్తే ఈ సర్టిఫికెట్‌ వస్తుందని చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సర్కారు వైద్యశాలల్లో, ఉప కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాల వల్ల ఈ ఘనత సాధ్యమైందని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఇంద్రాణి, సీహెచ్‌ఓ నవ్య, ఏఎన్‌ఎం సుజాత, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

బంగారు గొలుసు చోరీ

పెనుమాకలో వృద్ధురాలిపై దాడి

తాడేపల్లిరూరల్‌: పెనుమాకలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలిపై ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు దాడిచేసి ఆమె మెడలో ఉన్న బంగారపు గొలుసును లాక్కెళ్లిన ఘటన శుక్రవారం జరిగింది. తాడేపల్లి ఎస్‌ఐ వినోద్‌ కుమార్‌ కథనం ప్రకారం పెనుమాకకు చెందిన కళ్ళం సుబ్బాయమ్మ పిండిమరకు వెళ్లి ఇంటికి వస్తుండగా బొడ్రాయి సెంటర్‌ సమీపంలో గుర్తుతెలియని ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆ వృద్ధురాలి తలపై హెల్మెట్‌తో దాడి చేశారు. మెడలో ఉన్న 5 సవరల బంగారపు గొలుసును తెంచుకుని పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వృద్ధురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు