బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! 

26 Feb, 2021 07:04 IST|Sakshi
గుడుపల్లె రోడ్‌షోలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు

కుప్పం పర్యటనలో చంద్రబాబు తిట్ల దండకం

ముఖ్యమంత్రి, మంత్రులపై తీవ్రమైన విమర్శలు

అధికారులకు అడుగడుగునా హెచ్చరికలు

అధినేత తీరుపై ఆగ్రహించిన కార్యకర్తలు 

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం హుందాతనాన్ని మరిచింది. 14 ఏళ్ల పరిపాలన అనుభవం స్థాయిని దిగజార్చుకుంది. అపర చాణుక్యుడిగా అభివర్ణించుకునే  చంద్రబాబుకు బూతు పురాణమే శరణ్యమైంది. గురువారం కుప్పం పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేతలో అసహనం పెల్లుబికింది. పంచాయతీ ఎన్నికల పరాభవం జీర్ణించుకోలేక చివరకు తిట్లు లంకించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. డీలా పడిన తమ్ముళ్లను సముదాయించకపోగా బాబు ప్రసంగం యావత్తు ఆత్మస్తుతి.. పరనిందతో నిండిపోయింది.

సాక్షి, తిరుపతి:  ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గురువారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నం 12గంటలకు గుడుపల్లెకు చేరుకోవాల్సిన బాబు 3గంటలు ఆలస్యంగా వచ్చారు. ముందుగా నిర్ణయించిన సమయానికి కార్యకర్తలు రాకపోవడంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. అయితే ఈ విషయంపై సమాచారం అందుకున్న చంద్రబాబు ఆలస్యంగా రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈక్రమంలో టీడీపీ అధినేత ప్రసంగంపై కార్యకర్తలు నిరాశ వ్యక్తం చేశారు. ఓటమిపై కారణాలను అన్వేషించకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేశారని చర్చించుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారడానికి కారణమైన ముగ్గురు నేతలపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తే ఆ ఊసే ఎత్తకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిలదీసిన కార్యకర్తలు 
గుడుపల్లె కార్యకర్తల సమావేశంలో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీని నమ్ముకున్నవారికి ఇప్పటివరకు మీరు ఏంచేశారో చెప్పాలని కొందరు కార్యకర్తలు నిలదీయడంతో చంద్రబాబు షాక్‌ తిన్నారు. ఘోర పరాభవానికి కారణమైన ముఖ్య నాయకులను వెంటనే మార్చాలని డిమాండ్‌ చేయడంతో బాబు నచ్చజెప్పేందుకు యత్నించారు. కచ్చితంగా నాయకత్వ మార్పు ఉంటుందని, అయితే ఇప్పటికిప్పుడు చేయలేమని చేతులెత్తేశారు. దీంతో  కార్యకర్తల ఆగ్రహం మిన్నంటింది. చంద్రబాబుకు దిక్కు తోచక ఏయ్‌.. ఏయ్‌.. నిన్నే.. నేను చెప్పేది విను అంటూ శ్రేణులపై కేకలు వేశారు. కార్యకర్తల తిరస్కారం భరించలేని చంద్రబాబు తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించి ముగించేశారు.  అనంతరం రోడ్‌షోకు బయలుదేరితే అక్కడా జనాదరణ కరువైంది. ప్రజలు స్పందించకపోవడంతో రోడ్‌ షో వెలవెలబోయింది.  

బూతు పురాణం..
సాక్షి ప్రతినిధి, తిరుపతి:  కుప్పం పర్యటనలో చంద్రబాబు బూతు పురాణం విని స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. వచ్చీరాగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డిపై తిట్లు లంకించుకున్నారు. పోలీసులు, అధికారులపై తిరగబడాలని కార్యకర్తలను రెచ్చగొట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క సంతకంతో కేసులన్నీ కొట్టేస్తానని చెప్పారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే అప్పట్లో హంద్రీ–నీవా కాలువను పూర్తి చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇప్పటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇంకా హంద్రీ–నీవా పూర్తికాలేదని నిందలు మోపారు. కుప్పంలో ఓటమిపై సమీక్షించి దిశానిర్దేశం చేస్తారనుకుంటే ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపెట్టారని టీడీపీ కార్యకర్తలే వెల్లడించడం విశేషం. ఆయన ప్రసంగం విన్న తర్వాత చంద్రబాబు ఇక మారడని తే లిపోయిందని ఆ పార్టీ నేత ఒకరు మీడి యా ముందు వాపోయారు. అందుకే  కుప్పంలో కూడా టీడీపీకి విపత్కర పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి:
నాకు సీఎం పదవి అవసరమా?: చంద్రబాబు   
గ్రామాల్లో ‘మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు’

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు