నిజాలు తెలుసుకుని మాట్లాడాలి.. 

12 Jul, 2021 03:56 IST|Sakshi

టీడీపీ నాయకులపై ఎమ్మెల్యే ఆర్కే మండిపాటు  

అవినీతికి పాల్పడాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదని స్పష్టీకరణ 

మంగళగిరి: రాంకీ సంస్థలో జరిగిన ఐటీ దాడులపై టీడీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సూచించారు. పట్టణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాంకీ సంస్థలో తాను 2006 నుంచి ఉద్యోగిగా ఉన్నానని, ఉద్యోగులకు కంపెనీ ఇచ్చే షేర్లలో భాగంగా రెండు వేల షేర్లు తనకు ఇచ్చిందని, అలాగే 2007లో బోనస్‌ కింద పదివేల షేర్లు ఇచ్చిందని.. ఈ 12 వేల షేర్లను ఎవరికీ విక్రయించలేదన్నారు. 2010లో సంస్థ పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లిందన్నారు. 2009లో రాంకీ సంస్థ నుంచి తాను బయటికొచ్చానని అప్పటి నుంచి 2021 వరకూ తనకు రాంకీ సంస్థతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఐటీ అధికారులు తన నివాసంలో జరిపిన దాడుల్లో రూ.4,23,400 నగదు మాత్రమే దొరికిందని, మరెలాంటి బంగారం, డాక్యుమెంట్లు లభించలేదన్నారు.

దొరికిన నగదు సైతం తనకు వ్యవసాయం వలన వచ్చిన ఆదాయం అని తెలుసుకున్న అధికారులు తనకు రాతపూర్వకంగా పంచనామా రాసి ఇచ్చి వెళ్లారని నగదు కూడా సీజ్‌ చేయలేదని వెల్లడించారు. రాంకీ సంస్థ ఎన్నడూ పన్ను ఎగ్గొట్టలేదని ఐటీ దాడుల్లో పన్ను బకాయి ఉంటే చట్ట ప్రకారం సంస్థ చెల్లింపు చేస్తుందన్నారు. అవినీతికి పాల్పడాల్సిన అవసరం తన కుటుంబానికి లేదని ఆర్కే స్పష్టం చేశారు. టీడీపీ నేతలు తనపై బురద జల్లేందుకు ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలో 2014లో 12 ఓట్లతో గెలిచిన తాను.. 2019లో సీఎం కుమారుడు లోకేశ్‌ పోటీ చేసినా 6 వేల ఓట్లతో ప్రజలు తనను ఆదరించారని చెప్పారు. కంపెనీ, షేర్, మూలధనం, ఐటీ, పబ్లిక్‌ ఇష్యూ అంటే తెలియని స్థానిక టీడీపీ నేతలను నమ్ముకుంటే చంద్రబాబు, లోకేశ్‌లు కోటి జన్మలెత్తినా మంగళగిరిలో టీడీపీ గెలవలేదన్నారు. 

మరిన్ని వార్తలు